Telangana: ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది చెప్పే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు పదేపదే ప్రచారం చేసింది కూడా ఈ విషయం మీదనే కదా. అయితే అధికారాన్ని చేపట్టి పక్షం రోజులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది దీనిపై ప్రచారం కూడా భారీస్థాయిలో చేసుకుంటున్నది. అయితే ఇదే సమయంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇలా యూ టర్న్ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టారని, లేనిపోని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారని దుయ్యబడుతోంది.. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేస్తోంది. అయితే అందులో ఒక వీడియో మాత్రం తెగ వైరల్ గా మారింది.
ఎక్కడో మారుమూల అటవీ గ్రామాల్లో ఓ మహిళ తన నెత్తి మీద ఒక బిందెను, చేతిలో మరొక బిందెను పట్టుకుంటూ వస్తున్న ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నదాని ప్రకారం గతంలో ఈ ప్రాంతంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చేవని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటి సరఫరా వ్యవస్థను పట్టించుకోకపోవడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడే వారిని.. వారి కష్టాలు చూసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని.. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు ఆ పథకానికి మంగళం పాడుతున్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు.. అంతేకాదు అధికారంలోకి వచ్చే పదిహేను రోజులు కాలేదు అప్పుడే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటో ప్రజలకు చూపిస్తున్నారని దెప్పి పొడుస్తున్నారు.
మరోవైపు ఇలాంటి వీడియోలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సరైన విధంగా స్పందిస్తున్నారు. అధికారం కోల్పోయి 15 రోజులైన కాక ముందే భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని వారు పితవు పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేశారని.. 10 సంవత్సరాల తప్పులను వెలికితీస్తున్నామని.. కొద్దిరోజులు ఓపిక పడితే తెలుస్తుందని వారంటున్నారు. మిషన్ భగీరథ కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేవలం కమిషన్ల కోసమే మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చారని ఆరోపిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తే.. కేవలం 15 రోజుల్లోనే ఆ పథకాలు ఎలా మూలన పడతాయని వారు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకులు పోస్ట్ చేసిన వీడియో రాష్ట్రం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.