https://oktelugu.com/

BRS Manifesto: కెసిఆర్ హామీలు సరే.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసా?

రాష్ట్ర అప్పులు హద్దు మీరిపోయాయి. బడ్జెట్‌ అప్పులు, గ్యారంటీ రుణాలు కలిపి తడిసిమోపెడయ్యాయి. ఆచితూచి అప్పులు చేయండి, ఉచితాలకు అప్పుల సొమ్మును వినియోగించకండి అంటూ కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నా అప్పుల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు.

Written By:
  • Rocky
  • , Updated On : October 16, 2023 / 11:36 AM IST

    BRS

    Follow us on

    BRS Manifesto: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉంది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజ్యం ఏలుతున్న వారి అభీష్టం మేరకు కొత్త కొత్త భవనాలు నిర్మితమవుతున్నాయి. పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి. కొత్త కొత్త పథకాలు పురుడు పోసుకుంటున్నాయి. గతంలో ఉన్న పథకాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కేవలం కొన్ని శాఖలకు మాత్రమే కేటాయింపులు జరిగిపోతున్నాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అనేవి ఎండమావిగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉండటం, అనుకూల మీడియాలో భారీగా ప్రచారం చేసుకుంటుడం విశేషం.. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పంచుడు పథకాలకు శ్రీకారం చుట్టారు. చేతికి ఎముక అన్నదే లేనివిధంగా అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. నిజంగా అన్ని హామీలను నెరవేర్చే సత్తా తెలంగాణ కు ఉందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కాగ్ ఏం చెబుతోంది?

    రాష్ట్ర అప్పులు హద్దు మీరిపోయాయి. బడ్జెట్‌ అప్పులు, గ్యారంటీ రుణాలు కలిపి తడిసిమోపెడయ్యాయి. ఆచితూచి అప్పులు చేయండి, ఉచితాలకు అప్పుల సొమ్మును వినియోగించకండి అంటూ కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నా అప్పుల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. గ్యారంటీ అప్పులను కేంద్రం ప్రభుత్వం ఎలాగోలా కట్టడి చేసినా బడ్జెట్‌ అప్పులకు మాత్రం కళ్లెం పడడం లేదు. దీంతో రాష్ట్ర బడ్జెట్‌, గ్యారంటీ అప్పులు కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిమితిని మించిపోయాయి. ఒక రాష్ట్ర అప్పు మొత్తం ఆ రాష్ట్ర జీఎస్ డీపీలో 25 శాతానికి మించకూడదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశిస్తోంది. కానీ… రాష్ట్ర అప్పులు ఏకంగా 38 శాతానికి పెరిగిపోయాయి. ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర బడ్జెట్‌ అప్పులు, గ్యారంటీ అప్పులు మొత్తం రూ.5,01,588 కోట్లుగా నమోదయ్యాయని ‘కాగ్‌’ తెలిపింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ సోషియో ఎకనామిక్‌ అవుట్‌లుక్‌’ ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.13.27 లక్షల కోట్లుగా ఉంది. ఈ జీఎస్ డీపీలో అప్పులు 37.79 (38ు)శాతంగా ఉన్నాయి. మొత్తం రూ.5,01,588కోట్ల అప్పుల్లో బడ్జెట్‌ అప్పులు 2023మార్చి నాటికి 3,66,306 కోట్లు కాగా, వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీ అప్పులు రూ.1,35,282 కోట్లు. బడ్జెట్‌ అప్పులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా ఆ మొత్తం జీఎస్ డీపీలో 27.60(28%)గా నమోదైంది.

    ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనా?

    కాగ్.. అసలు విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం పేరుకు మూడు లక్షల కోట్ల జంబో బడ్జెట్ అని చెప్పింది గాని. అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎలా సమకూర్చుకుంటారో ఒక్క ముక్క చెప్పలేదు.. ఓ వైపు 2000 కోట్లకు ఇండెంట్ పెట్టుకోవలసిన దుస్థితి ఉన్నా సర్కారు చాలా విషయాలను దాచింది. ఉద్యోగుల జీతాలకు డబ్బులు సర్దుబాటు చేయవలసిన దుస్థితి.. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం ప్రవేశపెట్టిన మూడు లక్షల కోట్ల బడ్జెట్ హాస్యాస్పదంగా అనిపిస్తుంది.. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా హరీష్ ప్రసంగంలో రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ఆర్థిక స్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పాడు. కానీ అదే కేసీఆరే కదా బోలెడుసార్లు ధనిక రాష్ట్రమని, ఆర్థికంగా పటిష్టంగా ఉన్నామన్నాడు. విభజన వేళ కొడితే తిప్పి తిప్పి కొడితే 90 వేల కోట్ల అప్పు… అది ఇప్పుడు బడ్జెట్ రుణాలు ప్లస్ కార్పొరేషన్ రుణాలు కలిపితే ఐదారు లక్షల కోట్ల అప్పు. అదేమిటంటే ప్రాజెక్టుల మీద, ఉప యుక్త పనుల మీద ఖర్చు పెడుతున్నామంటున్నారు. ఇప్పుడు అదనంగా ఎన్నికల హామీలు.. స్థూలంగా తెలంగాణ పూర్తిగా వట్టిపోవడం ఖాయం. ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్లో 2.11 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం కాగా, 37 వేల కోట్లు మాత్రమే పెట్టు బడి వ్యయం. అర్థమైంది కదా, ప్రాజెక్టుల మీద, ఉపయుక్త పనుల మీద పెడుతున్న ఖర్చు శాతం ఎంతో?. మరి తెచ్చిన అప్పులు మొత్తం ఏమవుతున్నాయి?

    2021_22 కోసం పెట్టబడిన బడ్జెట్ పరిమాణం 2.30 లక్షల కోట్లు. ఆడిటింగ్ పూర్తయ్యేసరికి దాని పరిమాణం 1.83 లక్షల కోట్లు. అంటే దాదాపు 50 వేల కోట్ల వరకు కోత. ఇప్పుడు ఇది ఏకంగా 2.90 లక్షల కోట్లకు పెరిగింది. అంటే జస్ట్ రెండేళ్లలో కాగితాలపైనే 60 వేల కోట్లు పెంచేశారు. ఇక అసలు ఖర్చు రఫ్ అంచనాల మేరకు 2 నుంచి 2.20 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే ఓ 70 వేల కోట్ల మేరకు కోత అంచనా వేయవచ్చు. మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు కొత్త పథకాలకు కేసీఆర్ ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు?

    దేశానికి గుణాత్మక మార్పు అందిస్తామంటున్న కేసీఆర్.. రాష్ట్ర ఆదాయం మీద సరిగా అంచనాలు ఉండవా? ఎందుకు ఉండవు? ఆర్థిక శాఖకు అన్నీ తెలుసు.. కానీ ఎన్నికల మేనిఫెస్టో అంటేనే మసి బూసి మారేడు కాయ చేయటం. ఎలాగూ దానిని బట్టి నడుచుకోవడం అనేది ఉండదు కదా. చేతికి ఎముక లేనట్టుగా కేటాయింపులు చూపిస్తారు. తీరా ఖర్చులో అడ్డంగా చతికిల పడిపోతారు. అసలు అంత ఆదాయం ఉంటే కదా! పోనీ ప్రభుత్వం చెప్పినట్టు ఆదాయం ఉంటే ఆఫ్ట్రాల్ 2000 కోట్ల కోసం ఎందుకు ఇటీవల ఇండెంట్ పెట్టినట్టు? ఉదాహరణకి కేంద్రం నుంచి గ్రాంట్లుగా 40 వేల కోట్లు లెక్కేసుకుంటే.. 2021_22 లో వచ్చింది 8,600 కోట్లు. ఈసారీ 41 వేల కోట్లను రాసుకున్నారు. ఇంపాజిబుల్ ఫిగర్. 2021_22 లో సొంత పన్నుల ద్వారా ఆదాయం 91,000 కోట్లు. దాన్ని ఇప్పుడు 1.31 లక్షల కోట్లు చూపిస్తున్నారు. అంటే 40 వేల కోట్లు… జీఎస్టీ సొంతంగా వేసే సీన్ లేదు. పెట్రో మండుతోంది. పొగాకు మీద లాభం లేదు. ఇప్పటికే కిక్కు దింపేస్తోంది. ఇంకేమున్నాయి రాష్ట్రం పెంచడానికి, జనం మీద వేయడానికి? నాన్ టాక్స్ రెవెన్యూ 2021- 22 లో 8,800 కోట్లు… దాన్ని ఇప్పుడు 22.8 వేల కోట్లు చూపిస్తున్నారు. కేంద్ర ఆదాయంలో రెండు నుంచి మూడు వేల కోట్లకు మించి అదనంగా రాదు. మరీ 2.16 లక్షల కోట్ల ఆదాయం ఎలా? ఈ ఎన్నికల పథకాలకు నిధులు ఎలా? కెసిఆర్ సార్ జర సోచో?!