Homeజాతీయ వార్తలుTinmar Mallanna : బీఆర్‌ఎస్‌ కంట్లో నలుసు తీన్మార్ మల్లన్న.. అందుకే భరించలేకపోతోందా?

Tinmar Mallanna : బీఆర్‌ఎస్‌ కంట్లో నలుసు తీన్మార్ మల్లన్న.. అందుకే భరించలేకపోతోందా?

Tinmar Mallanna : చింతపండు నవీన్‌కుమార్‌.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.. తీన్మార్‌ మల్లన్న అనగానే నిక్కర్‌ వేసుకుని పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు అందకీ గుర్తొస్తాడు… తన భాష, యాసతో తెలంగాణ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. పాలకులను ప్రశ్నించడమే తన లక్ష్యం అని బాజాప్తా ప్రకటించి మరీ క్యూ న్యూస్‌ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ లాంచ్‌ చేశాడు. అంతకుముందు వివిధ న్యూస్‌ చానెళ్లలో కూడా పనిచేశారు. అయితే అన్ని ఆంధ్రా యాజమాన్యాలు కావడం, అందరూ అధికార పార్టీకి నయానో భయానో పాజిటివ్‌ వార్తలు ఇస్తుండడంతో ఆయా సంస్థల నుంచి బయటకు వచ్చాడు. తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. గెలవక పోయినా అధికార పార్టీని ఓడించేంత భయపెట్టాడు. ఇక ఇప్పుడు యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేల అవినీతిని, బీఆర్‌ఎస్‌ నేతల దౌర్జన్యాలను, అధికారుల బానిస బతుకులను ఆధారాలతో సహా ఎండగడుతూ అధికార బీఆర్‌ఎస్‌క కంట్లో నలుసులా మారాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు కంటగింపు అయ్యాడు. తమకు వ్యతిరేంగా గ్రామస్థాయి సోషల్‌ మీడియా చానెల్‌ ద్వారా గ్రామస్థాయయి వరకూ ప్రచారం చేస్తున్న మల్లన్నను ఎన్నికల వేళ కట్టడి చేయకుంటే కష్టమని అధికార పార్టీ నేతలు డిసైడ్‌ అయ్యారు.

అనేకసార్లు దాడులు..
జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌ క్యూ న్యూస్‌ చానల్‌ నడుపుతున్న తీన్మార్‌ మల్లన్నను భరించలేకపోతోంది. ఆయన కార్యాలయాలపై ఎన్నిసార్లు దాడులు చేశారో లెక్కలేదు.. ఈసారి కొత్తగా ఆయన కార్యాలయంపై దాడులు చేసి మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా ఏపీ తరహాలో ఎదురు కేసులు పెట్టి వారినే అరెస్ట్‌ చేశారు. ఆదివారం క్యూ న్యూస్‌ ఆఫీసులో కంప్యూటర్లు, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేస్తూ సిబ్బందికి పట్టుబడ్డ సాయి కిరణ్‌గౌడ్‌ మల్లన్న, క్యూ న్యూస్‌ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను తీవ్రంగా కొట్టి, హింసించి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మల్లన్న, తెలంగాణ విఠల్, క్యూ న్యూస్‌ సిబ్బందిపై పోలీసులు ఐపీసీ 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం, పలు నాన్‌ బయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌..
తీన్మార్‌ మల్లన్నకు సోషల్‌ మీడియాలో విశేషమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇక యువత ఆయన స్పీచ్, న్యూస్‌కు సులభంగా అట్రాక్ట్‌ అవుతోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించినంత పనిచేశాడు. తర్వాత సొంత పార్టీ ఆలోచన చేశాడు. కానీ పోలీసులు రకరకాల కేసులు పెట్టడంతో చాలాకాలం జైల్లో ఉన్నాడు. చివరికి బీజేపీ సాయంతో బయటకు వచ్చారు. ఆ పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోయారు. ప్రస్తుతం న్యూస్‌ చానెల్‌ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.

బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నిసార్లు దాడి చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా.. ఎక్కడా వెనక్కు తగ్గకుండా, అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్న ఒక సామాన్యుడిగా మల్లన్న ప్రజల దృష్టిలో హీరోగా మారాడు. ఈ క్రమంలో మరోసారి దాడి జరిగింది. అంతేకాదు.. దాడిచేసినవారిని వదిలేసి పోలీసులు రివర్స్‌లో మల్లన్నపైనే కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం కొసమెరుపు. అధికార పార్టీ నేతల ఒత్తిడి లేకుంటే ఇది జరుగుతుందా.. ఇది తెలంగాణ సమాజానికి అర్థం చేసుకోదు అనుకుంటే బీఆర్‌ఎస్‌ నేతల తెలివి తక్కువ తనమే. ముఖ్యంగా పోరాటాల నేపథ్యం ఉన్న యువత ఇలాంటి పోలీసుల తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఈ విషయం బీఆర్‌ఎస్‌ పెద్దలకు తెలియనిదేం కాదు. అయినా అధికారం ఉందన్న అహంకారంతో ఇలాంటివి కొనసాగిస్తూనే ఉన్నారు. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో ముందు ముందు చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular