BRS
BRS: కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు.. ఎన్నికల్లో గెలవడానికి కాదేహామీ అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ హామీలే కేసీఆర్‌ను గద్దెనెక్కించాయి. ఈసారి కూడా వాటినే నమ్ముకున్నారు కేసీఆర్. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు స్కీంలను ఇప్పటికే లాచ్ చేశారు. ఆన్ గోయింగ్ స్కీంలుగా చెప్పుకోడానికి సర్కారు పావులు కదిపింది. పోలింగ్ వరకు ఈ స్కీంలు కొనసాగించేలా గులాబీ బాస్ పెద్ద స్కెచ్ వేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పథకాలు కొనసాగించే పనులు నడుస్తున్నాయి. అయితే సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల క్లియరెన్స్‌కు ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. దీంతో సీఈఓ నుంచి పర్మిషన్ రాగానే ఫండ్స్ రిలీజ్ చేయడం కోసం రెవెన్యూ శాఖకు ఇప్పటికే ఓరల్ ఆర్డర్స్ జారీ అయినట్టు సచివాలయ వర్గాల సమాచారం.
ఈసీ అనుమతి కోసం..
షెడ్యూల్‌కు ముందే… వచ్చిన అప్లికేషన్లను క్లీయర్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుతోంది. సీఎంఆర్‌ఎఫ్ నుంచిసాయాన్ని అందించడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవనేది ప్రభుత్వ వర్గాల వాదన. కానీ విపక్షాలు లేదా ఇతరుల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ ప్రాసెస్ ఆగిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తుల విషయంలోనూ ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల స్పందన వస్తే వాటికి కూడా సాయాన్ని అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది.
నాలుగు నెలలుగా పెండింగ్లో..
రోజుకు కనీసంగా వెయ్యికి పైగా దరఖాస్తులు సీఎంఆర్‌ఎఫ్ కోసం ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి అందుతూ ఉంటాయి. నాలుగు నెలలుగా వీటి స్క్రూటినీ జరిగినా ఆర్థిక సాయం అందించడంలో సీఎం క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి. దాదాపు రెండు లక్షల అప్లికేషన్లు ఫండ్స్ కోసం క్లియరెన్స్ కోసం ఉన్నట్లు సచివాలయ అధికారుల సమాచారం. ఒక్కో అప్లికేషన్కు ఎంత మంజూరు చేయాలనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆమోదం మేరకు రెవెన్యూ శాఖ నిధులను విడుదల చేస్తుంది.
పొలిటికల్ మైలేజ్ కోసం..
ఆర్థిక సమస్యల కారణంగా నాలుగు నెలలుగా ఆగిపోవడంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో పొలిటికల్ మైలేజ్ కోసం దరఖాస్తుదారులకు చెక్కుల ద్వారా నిధులను రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి సీఎంఆర్‌ఎఫ్ సాయం కోసం వచ్చే దరఖాస్తులకు సీఎం కార్యాలయంలో ఆమోదం పొందిన తర్వాత మంజూరైన మొత్తాన్ని చెక్కుల రూపంలో పేదలకు ఆ ఎమ్మెల్యేలే పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ఎమ్మెల్యేలకు బదులుగా కలెక్టర్లు లేదా ఆఫీసర్ల ద్వారా చెక్కులను అందజేయనున్నట్లు సీఈఓకు ప్రభుత్వం వివరించాలనుకుంటుంది. ఏ రూపంలో పేదలకు ఈ సాయం వెళ్లినా అది పొలిటికల్ మైలేజ్‌గా ఉపయోగపడుతుందనేది అధికార పార్టీ ఆలోచన. ఇప్పటికే పలు స్కీములను ఆన్ గోయింగ్ అని చెప్పుకోవడం కోసం ప్రభుత్వం మొక్కుబడిగా ప్రారంభించిందనే విమర్శలు ఉన్నాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.