
TDP- Janasena Alliance: మొన్నటివరకూ తెలుగుదేశం పార్టీ అచేతనంగా ఉండేది. నేతలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారు. వస్తే అధికార పార్టీ పెట్టే ఇబ్బందులకు గురికాక తప్పదని భావించారు. వైసీపీ మూడేళ్ల పాలన పూర్తయిన వరకూ క్రియాశీలక టీడీపీ నాయకులెవరూ యాక్టివ్ కాలేకపోయారు. అటు చంద్రబాబు, లోకేష్ లు ఇచ్చిన ధైర్యం సైతం వారికి భరోసా ఇవ్వలేకపోయింది, యాక్టివ్ చేయలేకపోయింది. స్థానిక సంస్థల్లో సైతం పోటీచేసే ధైర్యం చేయలేక అధికార పార్టీకి సాగిలాలు పడిన నాయకులు ఉన్నారు. ఇలా భయపడుతూ బతుకుతున్న టీడీపీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఒక ఆశాధీపంలా కనిపించారు. అధికార పార్టీ దాష్ఠీకాలకు ఆయన ఎదుర్కొనేసరికి ఒక్కో టీడీపీ నేత ఇప్పుడు ధైర్యం పోగుచేసుకొని బయటకు వస్తున్నారు.అటువంటి టీడీపీ నాయకులే ఇప్పుడు స్వరం మార్చడం చర్చనీయాంశంగా మారింది. అసలు పొత్తు అన్నదే పొడవక ముందే విడిపోతామని హెచ్చరికలు పంపుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దక్కేసరికి జనసేన అవసరమే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటివరకూ పొత్తులపై చర్చలేవీ?
టీడీపీతో పొత్తు గురించి ఇప్పటి వరకూ చర్చించలేదని స్వయంగా పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభలో ప్రకటించారు. నిజానికి కలిసి పోరాటం చేయాలన్న అంశంపైనే మాట్లాడుకున్నారు. కానీ పొత్తులు.. సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకోలేదు. అసలు ఆ అవసరమే పవన్ కళ్యాణ్ కు రాలేదు. పదో ఆవిర్భావ సభలో పవన్ విభిన్నంగా మాట్లాడారు, చాలా స్పష్టంగా క్లుప్తంగా అన్నింటిపైనే క్లారిటీ ఇచ్చారు. వాస్తవాలను పార్టీ శ్రేణులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. తన విజన్ చెప్పేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈసారి అసెంబ్లీలో జనసేన అడుగు పెడుతుందని స్పష్టం చేశారు. గెలుపుకు అవకాశం ఉన్నచోట మాత్రమే పోటీచేస్తామని చెప్పుకొచ్చారు. ముందుగా పార్టీని, ఎమ్మెల్యేలను మంచి పొజిషన్ లో ఉంచి జనసేనను విస్తరించేందుకు ప్రయత్నిస్తానని కూడా పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు. ఎక్కడా ఆవేశపడకుండా గత పదేళ్లలో ఎదురైన గుణపాఠాలను అధిగమించి జనసేన ఏపీలో అతీతమైన రాజకీయ శక్తిగా ఎదగబోతోందని కూడా వ్యాఖ్యానించారు. అంతకు మించి ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు.
తొలుత స్నేహం అందించింది టీడీపీయే…
గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టీడీపీయే తొలుత పవన్ కు స్నేహ హస్తం అందించింది. వన్ సైడ్ లవ్ అన్న వ్యాఖ్యానంతో చంద్రబాబు దీనిని తెరపైకి తెచ్చారు. తనకు జనసేన అవసరం మిక్కిలిగా ఉందని భావించే ముందుగా పావులు కదిపారు. పరామర్శల పేరిట పవన్ వద్దకు వచ్చేందుకు బాట వేసుకున్నారు. అయితే దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ఎన్నోరకాలుగా ప్రభావితం చేయాలని చూసినా.. చంద్రబాబు గత అనుభవాలతో సన్నిహితులు పవన్ కు హెచ్చరికలు పంపినా జనసేనాని హుందాగా వ్యవహరించారే తప్ప ఎక్కడ కట్టుదాటలేదు. పొత్తు ఉంటుందన్న సంకేతం ఇవ్వలేదు. కేవలం రెండు పార్టీల మధ్య సన్నిహిత వాతావరణానికి కారణమయ్యారే తప్ప.. ఎక్కడ పొత్తుల అంశం తెరపైకి తేలేదు.

ఎమ్మెల్సీల గెలుపుతో మారిన స్వరం..
ఇప్పుడు టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తలకెక్కింది. ఇక తమకు తిరుగులేదన్న భావన వ్యక్తమవుతోంది. అలాగని పవన్ ను దూరం చేసుకుంటే విజయం దోబూచులాడుతుందని బెంగ. అందుకే పవన్ కావాలి.. కానీ పవన్ పార్టీ ఎదగకూడదు. ఇప్పుడు ఎల్లో బ్యాచ్ కు, మీడియాకు అదే పని. అందుకే విడిపోతామని హెచ్చరికలు పంపుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఏమైనా కలిసి నడిచామా అంటే జవాబు లేకుండా పోతోంది. కేవలం అధికార వైసీపీ ఆగడాల నుంచి ఏపీని విముక్తి చేస్తానన్న ఒకే ప్రకటన, ఓట్లు చీలిపోనివ్వనన్న శపథం వెరసి అంతా కలిసిపోయినట్టు టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే విడిపోదాం అన్న ప్రతిపాదనను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విడిపోతే అల్టిమేట్ గా నష్టపోయేది టీడీపీయే కానీ.. జనసేన కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అదే వాదనను మరింత ముదిరితే మాత్రం అది టీడీపీకే చేటు తప్ప జనసేనకు కాదని విశ్లేషిస్తున్నారు.