
Huzurabad Elections: హుజూరాబాద్ నియోజకవర్గం 5 నెలల నుంచి రాష్ట్ర ప్రజల నోళ్లలో నానుతూ ఉంది. ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఎన్నిక అనివార్యమైంది. దీంతో అప్పటి నుంచి ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ రెండు పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ ఎస్ అభ్యర్థిగా విద్యార్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బలిలో నిలవగా.. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. అయితే విజయం మాత్రం టీఆర్ఎస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.
మొదటి నుంచి హోరా హోరీ ప్రచారం..
హుజూరాబాద్ లో ఎన్నిక అనివార్యం అని తెలిసినప్పటి నుంచి అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మొదటి నుంచి ప్రచారంలో పాల్గొన్నాయి. తమదైన శైలీలో హోరా హోరీగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కుల సంఘాలు, యువజన సంఘాలతో మీటింగ్‌లు నిర్వహించాయి. వారితో ఒప్పందాలు చేసుకున్నాయి. బహుమతులు, పదవులు, డబ్బుల ఆశచూపాయి. తమకే మద్దతు ఇవ్వాలని కోరాయి. అలాగే ఇరు పార్టీల నుంచి వలసలు కూడా జరిగాయి. పొద్దున ఒక పార్టీలో ఉన్న నాయకుడు, సాయంత్రం అయ్యే సరికి మరో పార్టీలో కనిపించాడు.
గెలుపుపై రెండు పార్టీల ధీమా..
హుజూరాబాద్ గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఈ గెలుపు రెండు పార్టీలకు చాలా అవసరం. బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీకి బలం పెరిగింది అని నిరూపించవచ్చు. దీంతో రాష్ట్ర ప్రజల్లో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ పార్టీ అని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ గెలిస్తే టీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బీజేపీ వైపు చూసే ఛాన్స్ ఉన్నాయి. అలాగే టీఆర్ఎస్‌కు కూడా ఈ గెలుపు అనివార్యమయ్యింది. టీఆర్ఎస్ పై ప్రజల్లో ఇంకా ఆదరణ తగ్గలేదు అని నిరూపించుకోవడానికి, రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు తిరుగులేదని మరో సారి చాటి చెప్పేందుకు ఈ విజయాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది.
అయితే ఈ స్థానంలో తమదే గెలుపు అనే ధీమాలో రెండు పార్టీలు ఉన్నాయి. సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతుండగా.. ఈటలకు స్థానికుల్లో ఉన్న మంచి పేరు, ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి, బీజేపీపై ఉన్న అభిమానం, టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు. మరి హుజూరాబాదీ మనుసులో ఏముందో, ఆ ఓటరు ఎవరిని ఆశీర్వదించనున్నాడో తెలియాలంటే ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సి ఉంటుంది.