Telangana Elections 2023: తెలంగాణలో ఈసారి భారతీయ జనతాపార్టీ భిన్నమైన రాజకీయాలు చేస్తోంది. మోదీ ప్రధాని అయ్యాక.. పోల్‌మేనేజ్‌మెంట్‌లో తనదైన వ్యూహంతో పార్టీని చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చారు. కానీ, దక్షిణాదిన అధికారంలో ఉన్న కర్ణాటకను మాత్రం కోల్పోయారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ, ధాన్యం క్వింటార్‌లకు రూ.1000 బోనస్, ఉచిత ఎరువులు, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు ఎజెండాతో ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ ఓటమే లక్ష్యం..
ఇదిలా ఉంటే.. బీజేపీ కుదిరితే అధికారంలోకి రావాలి.. లేదంటే హంగ్ రావాలి.. అని కమలనాథులు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో అధికారంలోకి రావొద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని.. అది తమ పీఠం కిందకు నీళ్లు తెస్తుందని కమలనాథులు భయపడుతున్నారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీకి లేనిపోని ఐడియాలు ఇచ్చి మరీ సహకరిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఆర్థిక అవసరాల గురించి చెప్పాల్సిన పని లేదు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా లోటు లేదు. ములుగు లాంటి చోట్ల నోట్ల కట్టల వరద పారుతోందంటే వారి ఆర్థికి సౌలభ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ కాంగ్రెస్ నేతలకు ఏ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఐటీ దాడులతో వారి ఆర్థికమూలాల్ని కట్టడి చేస్తున్నారు.
సమష్టిగా వ్యూహాలు..
బీజేపీ–బీఆర్‌ఎస్ తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీతో దాడులు చేయిస్తున్నారు. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరూ సమావేశం అవుతున్నారని అంటున్నారు. ఈ వైపు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు అందకుండాచేయడమే కాదు.. బీఆర్‌ఎస్ తరపున ఓటర్లకు అధికారికంగా డబ్బులు పంచే కార్యక్రమానికీ అనుమతి ఇచ్చింది.
బీజేపీ మద్దతులోనే ‘రైతుబంధు’
బీజేపీ సహకారం లేకపోతే రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసే అవకాశమే వచ్చేది కాదు. నిబంధనల ప్రకారం.. ఈసీ పోలింగ్ కు ముందు ప్రభుత్వ పథకాలైనా సరే మంజూరు చేసేందుకు అంగీకరించదు. పోలింగ్ ముగిసిన తరవాతనే చేసుకోమంటుంది. కానీ ఇక్కడ పోలింగ్‌కు ఐదు రోజుల ముందు నగదును జమ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. 60 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేయడానికి బీజేపీ సహకారం లేకుండా అనుమతి రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీటుగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్..
ఐటీ, ఈడీ దాడులకు కాంగ్రెస్ జంకడం లేదు. మరో పది రోజులు కష్టపడితే అధికారం తమలే అన్న ధీమాతో ఎన్ని దాడుల చేసినా.. ప్రచారంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌కు తెలంగాణలో మంచి ఊపు కనిపిస్తోంది. కాంగ్రెస్‌దే గెలుపు అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మరో వారం రోజుల కష్టపడదాం అన్న భావన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఐటీ, ఈడీ దాడులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా హస్తం నేతలు చేస్తున్నారు.