
రాజకీయం అంటే వ్యూహాలతోనే పని. అధికార పక్షంలో ఉన్నవారికన్నా.. విపక్షంలో ఉన్నవారికే అవకాశాలు అందివస్తాయి. వాటిని అస్త్రాలుగా మలుచుకొని.. ప్రజల్లోంచి ప్రభుత్వంపై ఎక్కు పెట్టాలి. తద్వారా.. ప్రజల్లో కదలిక తెచ్చేందుకు యత్నించాలి, జనాన్ని కదిలించేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఒకే అంశాన్ని పట్టుకు వేళాడితే.. అది పాతపడిపోతుంది. పాత చింతకాయ పచ్చడి అయిపోతుంది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుగా మారిపోతుంది. ప్రజలు వినడం, పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంచుకున్న మార్గం కూడా ఇదేవిధంగా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన తర్వాత.. తెలంగాణలో ఆ పార్టీలో కొంత దూకుడు పెరిగిందన్నది వాస్తవం. ఇదే సమయంలో.. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ప్రభావం చూపడం.. ఆ పార్టీకి మరింత మైలేజ్ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే మరింత జోరు కొనసాగించిన సంజయ్.. కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ‘‘అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారు.. తెల్లవారే సరికి మరిచిపోతుంటారు’’ అంటూ కేసీఆర్ వ్యక్తిగత అలవాట్లపైనా సంజయ్ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఒకింత సంచలనంగా మారాయి. అయితే.. ఒకే సినిమా మళ్లీ మళ్లీ చూపిస్తే ఏమవుతుంది? అందులోని ఫీల్ పోతుంది. అయినా.. దాన్నే పట్టుబట్టి చూపిస్తే బోర్ కొడుతుంది.
ఏడాది కాలంగా బండి సంజయ్ ఇదే పద్ధతిలో రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మీదనే దృష్టిసారించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా.. ‘దళిత బంధు’ పథకం గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ 90ఎం ఎల్ సీఎం అని అన్నారు. పెగ్గు పెగ్గుకో నిర్ణయం తీసుకుంటాడని, ఆఖరి పెగ్గు తీసుకున్న తర్వాత తాను ఏమీ అనలేదని మాట మారుస్తాడని చెప్పుకొచ్చారు. ఈ మాటలు అక్కడ ఉన్నవారికి తాత్కాలికంగా నవ్వు తెప్పిస్తాయేమోగానీ.. సీరియస్ గా ప్రభుత్వం మీద పోట్లాడడానికి పనికి రావనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నిజానికి.. కేసీఆర్ అలవాట్ల గురించి అందరికీ తెలిసిందే. ఇది ఎప్పటిదో పాత విషయం. దీన్నే ఇంకా పట్టుకుని వేళాడితే బీజేపీ లాభం జరుగుతుందా? అన్నది ప్రశ్న. ఈ తీరుతోనే ఇంకా ముందుకు వెళ్లడం.. అంశాల వారీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి.. కేసీఆర్ వ్యక్తిగత అలవాట్లను ప్రశ్నించడం, దాడిచేయడం వల్ల ఓట్లు రాలుతాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఇదే రొట్ట డైలాగులు వాడితే బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఇకనైనా ఈ విషయం తెలుసుకొని, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించి, లోపాలను ఎత్తిచూపితే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. మరి, బండి సంజయ్ ఏమంటారో?