BJP – TDP – Janasena : ఏపీలో పొత్తుల వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టడం ఖాయమని తేలింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం ఒక కొలిక్కి వచ్చింది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని తెలుస్తోంది. 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఆ మూడు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో బిజెపితో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. జనసేన బయట నుండి మద్దతు తెలిపింది. టిడిపి, బిజెపి కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. వైసీపీ కేవలం 63 స్థానాలకు పరిమితమైంది. అయితే ఈసారి అంతకంటే పెద్ద విజయమే దక్కించుకుంటామని టిడిపి, జనసేన భావించాయి. అందుకే బిజెపిని కలుపుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాయి. అందులో సక్సెస్ కావడంతో.. తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి.
వైసీపీ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని టిడిపి, జనసేన భావిస్తున్నాయి. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ నుంచి జగన్ కు అంతర్గత సహకారం అందడం వల్లే ఎటువంటి ఇబ్బంది రాలేదని.. ఇప్పుడు బిజెపి కూటమితో కలిసి రావడం ద్వారా జగన్ కు సహాయ నిరాకరణ ఎదురవుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు విభేదించడంతో కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలపరంగా జగన్ కు సహకారం అందించిందని విశ్లేషణలు ఉన్నాయి.చంద్రబాబు పై ఉన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం జగన్ కు సహకారం అందించింది. అదే సమయంలో జనసేన ఒంటరి పోరుకు వెళ్ళింది. అటు కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా జగన్ కు సహకరించింది. దీంతో చంద్రబాబు ఒంటరి అయ్యారు. ఎన్నికల వ్యవస్థలో సరైన సాయం లేక వెనుకబడ్డారు. జనసేన చీల్చిన ఓట్లతో తెలుగుదేశం పార్టీకి పరాజయం ఎదురయ్యింది.
గత ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీకి ఏపీలో 5 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. అది 2014 ఎన్నికల్లోనే రుజువు అయ్యింది. అయితే గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వంచించిందని చంద్రబాబు ప్రజలను నమ్మించగలిగారు. అటు మోడీ సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్ గూటికి వెళ్లారు. దీంతో ఇది బిజెపి శ్రేణులకు మింగుడు పడలేదు. అలాగని ఒంటరి పోరాటం చేసి బిజెపి ఏపీలో సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే బిజెపి ఓట్లు సైతం వైసీపీ వైపు వెళ్లాయి. టిడిపికి రాజకీయ శత్రువుగా ఉన్న వైసీపీకి బిజెపి శ్రేణులు అండగా నిలబడ్డాయి. దాని ఫలితంగా బిజెపి ఓటు శాతం తగ్గింది.
గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం వరకు ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి జనసేన బలం గణనీయంగా పెరిగింది. దాదాపు 12 శాతం వరకు ఓట్లు ఆ పార్టీ సాధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జనసేన గెలుపు పై అపనమ్మకం ఉన్నవారు వైసీపీకి ఓటు వేశారు. కాపు సామాజిక వర్గం సైతం వైసీపీ వైపే మొగ్గు చూపింది. అయితే ఈసారి పవన్ జాగ్రత్త పడ్డారు. తన అభిమానులు తనకు ఓటు వేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు కాపు సామాజిక వర్గం సైతం ఏకతాటిపైకి వచ్చింది. జనసేనకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ఈ లెక్కన జనసేన ఓటు శాతం కూడా పెరిగిందని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే ఆ పార్టీని కలుపుకొని ముందుకెళ్లారు. మరోవైపు ప్రజా వ్యతిరేకతతో జగన్ సర్కార్ సంప్రదాయ ఓటుకు సైతం గండి పడిందని అంచనా వేశారు. అటు బిజెపి ఓటు శాతం ఐదు నుంచి ఆరు శాతం ఉంటుందని.. ఇటు జనసేన ఓటు శాతం సైతం పెరిగిందని.. ఇవన్నీ కూటమి వైపు టర్న్ అయితే ఏకపక్ష విజయం సాధ్యమని చంద్రబాబు నమ్ముతున్నారు. అటు వ్యవస్థలపరంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే పొత్తు కోసం చివరి వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు. అయితే చంద్రబాబు అంచనాలు ఫలిస్తాయో? లేదో? చూడాలి.