MLC elections : ప్రభుత్వ ఉద్యోగుల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకత.. బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి గెలుపే దానికి ఉదాహరణ

MLC elections : ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదా? పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తమకు ఫలాలు అందడం లేదా? బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సర్కార్ తీరుపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తున్నది. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా స్వరాష్ట్రంలో ఉపాధ్యాయులపై సర్కారు ఉక్కు పాదం మోపుతోంది. పలు రకాల జీవోలు తీసుకొచ్చి వారికి నరకం చూపిస్తోంది. స్థానికతాంశంలో కొత్త భాష్యం చెప్పి వారికి ప్రమోషన్లు, బదిలీలు జరగకుండా చూసింది. అంతేకాదు […]

Written By: Bhaskar, Updated On : March 17, 2023 9:56 am
Follow us on

MLC elections : ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదా? పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తమకు ఫలాలు అందడం లేదా? బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సర్కార్ తీరుపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తున్నది. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా స్వరాష్ట్రంలో ఉపాధ్యాయులపై సర్కారు ఉక్కు పాదం మోపుతోంది. పలు రకాల జీవోలు తీసుకొచ్చి వారికి నరకం చూపిస్తోంది. స్థానికతాంశంలో కొత్త భాష్యం చెప్పి వారికి ప్రమోషన్లు, బదిలీలు జరగకుండా చూసింది. అంతేకాదు గతంలో ఎన్నడు లేని విధంగా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తోంది. ఇక దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు.. దానిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో రుజువు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు..

ఏవీఎన్ రెడ్డి తన సమీప పిఆర్టియు అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి పై విజయం సాధించారు. మార్చి 16 న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 17వ తేదీ ఉదయం నాలుగున్నర గంటల వరకు పూర్తయింది.. హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మార్చి 16 సాయంత్రం ఐదు గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ 50 శాతానికి మించి దక్కలేదు.. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది.. మూడో స్థానంలో ఉన్న యుటిఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారయింది. ఏవీఎన్ రెడ్డి 1150 ఓట్ల తేడాతో సమీప పిఆర్టియు అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి పై విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1: 40 నిమిషాలకు పూర్తయింది..

ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహ బూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం వెనక అనేక కారణాలు ఉన్నాయి.. ముఖ్యంగా బదిలీలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ స్థానికత కోసం కొట్లాడారో, స్వరాష్ట్రంలోనూ అదే స్థానికత అంశం కోసం పోరాడాల్సి రావడం ఉపాధ్యాయులను కలవరపాటుకి గురిచేసింది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివాదాస్పద జీవో తీసుకురావడంతో చాలామంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ కావలసి వచ్చింది. దీనిపై ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మరోవైపు ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలోనూ ప్రభుత్వం మోకాలడ్డింది. ఇలా స్వరాష్ట్రలోనూ తమకు పదఘట్టనలే ఎదురవుతున్న నేపథ్యంలో అనివార్యంగా ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీకి జై కొట్టారు.

కాగా ఏవీఎన్ రెడ్డి విజయం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఏవీఎన్ రెడ్డి సర్కార్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరిలో జరిగే శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా ఇదేవిధంగా ఉంటాయని ఆయన జోష్యం చెప్పారు.. ప్రభుత్వ ఉపాధ్యాయులను రాచిరంపాన పెడుతున్న భారత రాష్ట్ర సమితికి ఈ ఫలితం కనువిప్పు కలిగించాలని ఆయన పేర్కొన్నారు..ఏవీఎన్ రెడ్డి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.. శాసనసభ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని కోరారు.