దుబ్బాక ఎన్నికపై ఎందుకింత ఉత్కంట ?
మాములుగానయితే ఇది ఒక అసెంబ్లీ కి జరిగే పోటీ మాత్రమే. కాకపోతే ఇది రాబోయే పరిణామాలకు ఓ సంకేతంలాగా మారింది. ఇక్కడ కనక కాంగ్రెస్ కనీసం రెండో స్థానానికి రాకపోతే తెలంగాణాలో చుట్ట చుట్టేయాల్సిందే. ఇప్పటికే పోయినసారి లోక్ సభ,మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కి ప్రతిపక్ష స్థానానికి అడ్డొచ్చింది. ఒకేసారి నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచి రాజకీయ పండితుల్ని షాక్ కి గురిచేసింది. ఆ తరవాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కన్నా మెరుగైన ఫలితాల్ని సాధించింది. అయితే ఇప్పటివరకు బిజెపి ఉత్తర తెలంగాణాలో, హైదరాబాద్ నగరంలోనే తన సత్తా చాటుకుంది. మెదక్ ఉత్తర తెలంగాణాకి చివరన వున్న ప్రాంతం. కెసిఆర్,హరీష్ రావు లకు అడ్డా. సిద్ధిపేట,గజ్వేల్ నియోజకవర్గాలు పక్కనే వున్నాయి. ఇక్కడ కనక తెరాస ఓడిపోతే కెసిఆర్, హరీష్ రావుల పరువుపోయినట్లే. అందుకే ఈ ఉప ఎన్నికను ప్రేస్టేజి గా తీసుకున్నారు. మాములుగానయితే తెరాస కి ఈ ఎన్నిక నల్లేరు మీద నడకలాంటిదే. కానీ ఇప్పుడు కాంగ్రెస్,బిజెపి లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెరాస ఏదో విధంగా గెలిచినా అది వాళ్ళకున్న ప్రస్తుత ఇమేజికి దెబ్బ తగులుతుంది. అది వారికీ తెలుసు. అందుకే భారీ మెజారిటీతో గెలవాలనేది వాళ్ళ ప్లాన్.
ఇక కాంగ్రెస్, బిజెపికి కూడా ఇది ప్రతిష్టాత్మకం గా మారింది. ఇందులో గనుక కాంగ్రెస్ మూడో పార్టీగా బయటకొస్తే ప్రజల్లో కెసిఆర్ ని తట్టుకొని నిలబడే దమ్ము కాంగ్రెస్ కు లేదని జనం అనుకుంటారు. అసలే జాతీయ స్థాయిలో బలహీనంగా వున్న సందర్భంలో అటువంటి ఫలితమే వస్తే కాంగ్రెస్ నుంచి నాయకులు సర్దుకోవటం ఖాయం. అందుకే కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ మూడో పార్టీగా వస్తే హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల్లో డిపాజిట్లు పోవటం ఖాయం. ఇప్పటికే ఆంధ్రలో జీరోగా వున్న పార్టీ తెలంగాణాలో కూడా అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటం తప్పదు. ఆంధ్రాని ఫణంగా పెట్టి తెలంగాణా ఇచ్చినా ఫలితం లేకపోతే రెండింటికి చెడ్డ రేవడిలాగా తయారవుతుంది. అందుకే ఎలాగయినా దుబ్బాకలో అస్తిత్వం చాటుకోవాలనే పట్టుదలతో వున్నారు. చెరకు శ్రీనివాస రెడ్డి తండ్రి ముత్యం రెడ్డి నాలుగుసార్లు ఇంతకుముందు ఎమ్యేలే గా చేసిన వ్యక్తినే.
ఇక బిజెపికి దుబ్బాక ఎప్పుడూ బలమైన స్థానం కాదు. కాకపోతే రఘునందనరావు అందరికన్నా ముందుగా ప్రచారం మొదలుపెట్టాడు. ప్రతిఒక్క గ్రామాన్ని సందర్శించాడు. స్వతహాగా మంచి మాటకారి. ఇటీవల టివి మాధ్యమాల్లో బిజెపి తరఫున అధికార ప్రతినిధిగా వుండటంతో ప్రతి విషయంపై మంచి అవగాహన వున్న వ్యక్తి అనే పేరు సంపాదించుకున్నాడు. విద్యావేత్త. హై కోర్టు అడ్వొకేటు. అభ్యర్దులపరంగా చూస్తే ముగ్గురిలోనూ గట్టి అభ్యర్ధిగా పరిగణించవచ్చు. అదీగాక పోయినసారి పోటీచేసి ఓడిపోయాడనే సానుభూతిని సంపాదించు కోగాలిగాడు. ముందుగా ప్రచారం మొదలుపెట్టటంతో తను గట్టి పోటీ అభ్యర్ధి అనే భావన ప్రజల్లో వచ్చింది. అందుకే కెసిఆర్,హరీష్ రావులు తననే ప్రధానంగా టార్గెట్ చేసారు. దాన్నిబట్టే తనే గట్టి ప్రత్యర్ధి అనేది ప్రజలకు కూడా అర్ధమయ్యింది. మామూలుగానయితే అభ్యర్ధుల ఇలాకాలో డబ్బులు దొరికాయంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడి ఓడిపోవటం జరుగుతుంది. కానీ ఈసారి ప్రజల్లో అటువంటి భావం ఏర్పడినట్లు లేదు. ఎందుకంటే ఇప్పటికే కెసిఆర్ పై ప్రత్యర్ధులపై ఇటువంటి ప్రయోగాలు చేస్తాడనే భావన వుండటం. ఇంతకుముందు ఉత్తమ కుమార రెడ్డి, రేవంత్ రెడ్డిలపై ఇటువంటి ప్రయోగాలే చేసి వుండటంతో ప్రజలకి ఈ ప్రయోగం గురించి అనుమానాలు తలెత్తాయి. రెండోది, బిజెపి తెలివిగా దీనిని తిప్పి కొట్టే వ్యూహం అమలుచేసి కెసిఆర్ కి ధీటైన సమాధానం ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ అయితే ఈస్థాయిలో ప్రతివ్యూహం చేయగలిగేది కాదు. మూడోది, ఈ విషయంలో తెరాస పవిత్రతపై ఎవరికీ నమ్మకం లేకపోవటం. మొత్తం మీద ఈ సారి తెరాసకి ఈ ప్రయోగం అనుకున్న సత్ఫలితాలు రాలేదని తెలుస్తుంది.
ఈ ఎన్నిక ఫలితాన్ని ఎలా చూడాల్సి వుంటుంది?
తెరాస,కాంగ్రెస్ లకు ఇది ప్రతిష్టాత్మాక పోరాటం. తెరాసకి మంచి మెజారిటీతో గెలవకపోయినా,కాంగ్రెస్ కనీసం రెండో స్థానంలో నిలబడకపోయినా దెబ్బనే. పోయినసారిలాగా తెరాస గెలిచి,కాంగ్రెస్ రెండో స్థానంలో వుంటే ఇద్దరి పరువు నిలబడుతుంది. ఆ రెండింటిలో ఏది జరగకపోయినా వాటికి నష్టమే. అదే బిజెపికి పోయేదేమీ లేదు. ఇంతకుముందు మూడో స్థానంలో వుంది. ఇప్పుడూ అంతేగదా అని సరిపెట్టుకుంటారు. ఒకవేళ అలా కాకుండా కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వస్తే అది నైతిక విజయమే అవుతుంది. పోటీ గట్టిగా వుండి నువ్వా నేనా అన్నట్లు వుండి తెరాస,బిజెపి ల్లో ఎవరు గెలిచినా అది బిజెపికి అతి పెద్ద బూస్టింగ్ అవుతుంది. కెసిఆర్ వ్యతిరేకులందరూ బిజెపిలో సమీకరించబడతారు. 2024 ఎన్నిక మరో బెంగాల్ లాగా మారే అవకాశం వుంది. జిహెచ్ఎంసి ఎన్నిక తెరాసకి గడ్డుగా మారే అవకాశముంది. బిజెపి దుబ్బాక ఎన్నికని తెలంగాణాలో అధికారంలోకి రావటానికి నిచ్చెనమెట్టు లాగా భావిస్తుంది. ముఖ్యంగా బిజెపికి కొత్త సారధి వచ్చిన తర్వాత దూకుడుగా వుంది. బండి సంజయ్ కుమార్ కి నాయకత్వ భాద్యతలని ఇచ్చి బిజెపిని కెసిఆర్ ని తట్టుకొనే ధీటైన శక్తిగా ప్రజల ముందుకి పెట్టటంలో వ్యూహం సరైనదేనని అనుకోవాల్సి వస్తుంది. అందుకే దుబ్బాక ఎన్నిక బిజెపి వ్యూహం ఇప్పటికే విజయవంతమైందని భావించాలా?