Minister Gangula Kamalakar: మునుగోడు ఫలితం బీజేపీలో ఆగ్రహం తెప్పించింది. గెలుస్తామన్న ధీమాలో ఉన్న పార్టీని ఓటమికి గురి చేసిన టీఆర్ఎస్ పార్టీ తీరుపై అధినాయకత్వం గుర్రుగా ఉంది. గతంలోనే మంత్రి గంగుల కమలాకర్ పై పలు మార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కమలాకర్ ఇల్లు, వ్యాపారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్ కంటాక్స్(ఐటీ) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో దీనిపై రాజకీయ కోణాల్లో కాకుండా వ్యాపారులపై దాడులు కొనసాగే క్రమంలోనే మంత్రి ఆస్తులపై విచారణ చేపట్టినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.

గతంలో బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య మంచి అవగాహన ఉండేది. దీంతో నోట్ల రద్దు నుంచి ఎన్నో పనులు కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికతో రెండు పార్టీల్లో వైరం పెరిగిపోయింది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి ఈట ల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకుని గెలిపించడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఇక మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రంలోనే మంత్రుల్లో ధనవంతుడు కావడంతో అతడి పీచమణచాలనే ఉద్దేశంతో దాడులకు ఉసిగొల్పినట్లు మరో వాదన వస్తోంది. ఈనేపథ్యంలో దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బండి సంజయ్, గంగుల మధ్య గతంలోనే వైరం పెరిగింది. ఇద్దరు కలిసి ఎమ్మెల్యే ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసినా సంజయ్ ఓటమి చవి చూశారు. దీంతో అప్పటి నుంచే వారి మధ్య రాజకీయ వైరం పెరిగింది. దీంతో పలుమార్లు గంగుల కమలాకర్ వ్యాపారాలపై సంజయ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంగుల కమలాకర్ ను రాజకీయంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే అతడి పవర్ తగ్గించి ఎన్నికల్లో గెలవకుండా చేయాలనే కోణంలో ఆలోచిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు బీఆర్ఎస్ అంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న టీఆర్ఎస్ ను నిలువరించే క్రమంలో బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎదగాలని చూస్తున్న బీజేపీని టార్గెట్ చేసుకోవడంతో ఇక మీదట టీఆర్ఎస్ ను కూడా అదే విధంగా అధికారానికి దూరం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రారంభమైన ఆపరేషన్ లో మొదట గంగులను ఎదుర్కొనేందుకు రెడీ అయింది.
దీంతోనే ఈడీ, ఐటీ దాడులు కొనసాగిస్తోంది. ప్రస్తుతం గంగుల దగ్గర సంపద ఎక్కువగా ఉండటంతో దీనికి ఆదాయ మార్గాలేమిటనే కోణంలో విచారణ సాగుతోంది. ఇంత మొత్తంలో డబ్బు సంపాదించి రాజకీయాన్ని శాసిస్తున్న గంగులను ఎలాగైనా అడ్డుకుంటే టీఆర్ఎస్ కు ఆదాయ మార్గాలు లేకుండా పోతాయి. దీంతో ఎన్నికల్లో ఎలా మనగలుగుతుందో చూద్దామనే విషయంపైనే బీజేపీ గురిపెట్టినట్లు రాజకీయ వర్గాల వాదన. మొత్తానికి బీజేపీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనే క్రమంలో మొదట గంగులను లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం.