https://oktelugu.com/

Nitish Kumar: ఆపరేషన్ లోటస్.. తర్వాతి టార్గెట్ నితీష్ కుమార్

ఇక తాజాగా మహారాష్ట్రలో శివసేన తో కలిసి ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ కలిపేసుకుంది. శరత్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ను ఏకంగా మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిని చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : July 7, 2023 / 03:52 PM IST

    Nitish Kumar

    Follow us on

    Nitish Kumar: మరి కొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు.. రెండు పర్యాయాలు అధికారం దక్కింది. మూడవసారి కూడా అధికారాన్ని దక్కించుకోవాలి అనుకుంటున్నది. అందుకే ఈ ఎదురు అన్నది లేకుండా చూసుకోవాలని బిజెపి అనుకుంటోంది. కర్ణాటక ఫలితం ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. దాని నుంచి ఇప్పటికీ ఆ పార్టీ తేరుకోలేకపోతోంది. ఆ ఫలితం మిగతా రాష్ట్రాల మీద పడొద్దు అని భావించి ఏకంగా పలు రాష్ట్రాలకు కొత్త సారధులను నియమించింది. మంత్రివర్గంలోనూ మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

    ఇక తాజాగా మహారాష్ట్రలో శివసేన తో కలిసి ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ కలిపేసుకుంది. శరత్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ను ఏకంగా మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిని చేసింది. అంతేకాదు శివసేన లాగానే ఆ పార్టీని కూడా రెండు ముక్కలు చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకమవడానికి విపక్షాలు ఇటీవల పాట్నాలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాయి. టికెట్ల విషయం పక్కన పెడితే దాదాపు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. మరోసారి భేటీ అయ్యి టికెట్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. అయితే ఇప్పుడు ఆ విపక్ష కూటమికి సంబంధించి రెండవ సమావేశం జరుగుతుందా? లేదా? అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలను కకావికలం చేసేందుకు బిజెపి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది.

    ప్రతిపక్షాల కూటమి సమావేశానికి హాజరైన ఎన్సిపిని బీజేపీ దాదాపు రెండు ముక్కలు చేసింది. మహారాష్ట్రలో శివసేనను రెండుగా చీల్చిన ఏడాదిలోపే ఎన్ సి పి లో కుంపట్లు రగిల్చింది. ఇక తాజాగా బీహార్ వైపు తన దృష్టిని మళ్లించింది. ఎందుకంటే విపక్ష కూటమికి నితీష్ కుమార్ సారథ్యం వహిస్తుండడం బిజెపికి నచ్చడం లేదు. మొదటి సమావేశం నిర్వహించిన నితీష్ కుమార్.. రెండవ సమావేశాన్ని పక్కనపెట్టి తన పార్టీ ఎమ్మెల్యేలతో రోజూ సమావేశం అవుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం పిలిపించి మాట్లాడుతున్నారు. బిజెపి ఆపరేషన్ లోటస్ కు ఎవరూ లొంగిపోద్దని చెప్తున్నారు. చివరికి ఈ బాధ మొత్తం ఎందుకు బిజెపికే లొంగి పోతే బాగుంటుంది కదా అని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఆయనకు సూచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంటే విపక్షాల కూటమికి ప్రధాన స్తంభంగా ఉన్న నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ వైపు చేరిపోతే ప్రతిపక్ష కూటమి నైతిక పరాజయం దాదాపు ఖాయమైనట్టే. భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు కూడా దాదాపుగా ఇదే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధానాన్ని అనుసరించేది. ఇప్పుడు ఏకంగా సోయిలోనే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొనే స్థాయికి దిగజారింది.

    రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో బాగానే ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు లాగుతుంది. ఎంపీలను కూడా వదలడం లేదు. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలను దాదాపుగా నిర్వీర్యం చేస్తున్నది. కర్ణాటక ఫలితాల తర్వాత తన పట్టు తగ్గుతుందని భావించారో ఏమో తెలియదు కానీ.. నరేంద్ర మోడీ మొత్తానికి ఆపరేషన్ లోటస్ ను మరింత సమర్థవంతంగా చేపడుతున్నారు. ఇది దీర్ఘకాలం భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చుతుందా? లేక పుట్టి ముంచుతుందా? అనేది త్వరలో తేలుతుంది.