దుబ్బాక ఎన్నికలో సంచలన విజయంతో మంచి ఊపు మీద ఉంది బీజేపీ. దీంతో వచ్చే ఎన్నికలను అన్నింటినీ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా తన నెక్ట్స్ టార్గెట్ తిరుపతిగా నిర్ణయించుకుంది. తిరుపతి వైసీపీ ఎంపీ కరోనాతో మృతి చెందడంతో ఆ స్థానానికి త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాకలో ఎమ్మెల్యే మృతితో వచ్చిన ఉపఎన్నికలో బీజేపీ చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. అదేతరహాలో ఏపీలోనూ తన ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతోంది.
Also Read: మాజీ మంత్రి ‘గంటా’ను ఆదుకునేదెవరు?
తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విల్లూరుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న సునీల్ ధియోధర్ ఈ మిషన్ చేపడుతున్నారు. అందుకే ఆయన ఎక్కువగా తిరుపతిలోనే మకాం వేస్తున్నారు. తాజాగా తిరుపతిలో కార్యకర్తల సమావేశం పెట్టి అందర్నీ కార్యోన్ముఖుల్ని చేశారు.
గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. వైసీపీకి ఆ పార్టీ కార్యకర్తలు మద్దతిచ్చారని ప్రచారం సాగింది. ఫలితంగా డిపాజిట్ కూడా రాకుండా పోయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ తన పార్టీ కన్నా.. బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. జనసేన మద్దతు ఉంటుందని తిరుపతి పార్లమెంట్ పరిధిలో పవన్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారని బీజేపీ అంచనాకు వచ్చింది. దీంతో గెలుపు తమదేనని ధీమాతో ఉంది.
Also Read: బీజేపీకి టైం ఇవ్వొద్దు.. సర్దుకునే చాన్స్ లేకుండా కేసీఆర్ ప్లాన్?
అయితే.. గత ఎన్నికల్లో జనసేన పొత్తులో భాగంగా తిరుపతి సీటును బీఎస్పీకి ఇచ్చింది. బీఎస్పీ అభ్యర్థి 20 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ఈ సారి జనసేన పార్టీ అక్కడి నుంచి పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఆ పార్టీ నేతలు ఒక్కరంటే ఒక్కరూ స్పందించడం లేదు. బీజేపీ నేతలే.. జనసేన కూడా పోటీ చేస్తామని ముందుకు వస్తే హైకమాండ్‌తో చర్చించి.. ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తోంది. అయితే జనసేన మాత్రం తాము తిరుపతిలో పోటీకి ఆసక్తిగా ఉన్నామని మాత్రం చెప్పడం లేదు. వివిధ సమీకరణాలను బట్టి చూస్తే తిరుపతిలో జనసేన బలంగా ఉంటుంది. బీజేపీ ఓటు బ్యాంక్ 20 వేలు దాటలేదు. అయితే ఈ ఎన్నికలో జనసేన పోటీ చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్