BJP New Parliamentary Board: వాజ్ పేయి శకం ముగిసింది. అద్వానీ అంకం చివరి దశలో ఉంది. ఇప్పుడు నడుస్తోంది మోడీ ఇజం. ఆయనకు అనుగుణంగానే పార్టీ కూడా నడుచుకుంటున్నది. 2014లో గోవా తీర్మానం మొదలు ఇప్పటివరకు బిజెపిలో ఒకటి రెండు సంఘటనలు మినహా మోదీ చెప్పిందే పార్టీకి వేదం. ఇక ఇప్పుడు ఆ ఒకటి రెండు సంఘటనలు కూడా జరిగే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు బిజెపి పూర్తిగా మోడీ కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. అతడి చెప్పు చేతల్లో ఇమిడిపోయింది. బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణే ఇందుకు నిదర్శనం.
-నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్ అవుట్
బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు ఉద్వాసన పలికారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ కు చోటు దక్కింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కారణమైన సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా జాబితాలో చోటు దక్కించుకోలేదు. తొలిసారి బిజెపి పార్లమెంటరీ బోర్డులోకి సిక్కు నేతతో పాటు ఆరుగురికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా రాజకీయంగా తరం మార్పిడి జరగాలని చాలా వరకు మార్పులు చేర్పులు చేశారు. ఇక బిజెపి కి మూలవృక్షమైన ఆర్ఎస్ఎస్ కు అత్యంత సన్నిహితుడైన నితిన్ గడ్కరికి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత కొంతకాలం నుంచి నితిన్ గడ్కరీ మోదీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలని అనిపిస్తోందని పలుమార్లు పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తొలగింపుతో పార్లమెంటరీ బోర్డులో ముఖ్యమంత్రులకు చోటు లేకుండా పోయింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటును ప్రోత్సహించి ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రి చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ కు చోటు దక్కడం మోడీ మార్క్ కు నిదర్శనం.
Also Read: Ram Column: బ్రాహ్మణ, బనియా ముద్ర నుంచి సామాజికన్యాయ దిశగా బీజేపీ పరివర్తన
-కర్ణాటకలో గెలవాలని…
కర్ణాటకలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి రావాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలని బిజెపి అనుకుంటున్నది. బసవరాజు బొమ్మయి ద్వారా ఆ పని కాదని తెలిసి మళ్లీ యడ్యూరప్ప నే బిజెపి నమ్ముకుంది. అందులో భాగంగానే బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు చోటు కల్పించారు. ప్రస్తుతం కర్ణాటకలో 18 శాతం మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. మీరంతా కూడా ఆ రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరు. మరో ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందుగానే బిజెపి లింగాయత్లను ఆకర్షించే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇక అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మకు అవకాశం కల్పించేందుకు పక్కకు తప్పుకున్న ఆ రాష్ట్ర మాజీ సీఎం శర్బానంద సోనోవాల్ కు అవకాశం దక్కింది. వీరితోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు చోటు లభించింది.
-తెలంగాణ లో బీసీ మంత్రం
గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన లక్ష్మణ్ కు ఈసారి పార్లమెంటరీ పార్టీలో చోటు దక్కడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ముఠా నరేష్ చేతిలో ఓటమి చెందారు. అయితే ఆయనను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీసీ ఓటర్లు 31 శాతం ఉండడంతో వారి మనసులను గెలుచుకునేందుకు బిజెపి పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్ కు స్థానం దక్కింది. తెలంగాణలో మరో పదహారు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక బిజెపి పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారికి ఆటోమేటిక్ గా పార్టీ ఎన్నికల కమిటీలో చోటు దక్కుతుంది. ఇప్పటివరకు బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఏకైక ముస్లిం నేత షానవాజ్ హుస్సేన్ ను తప్పించారు. దీంతో కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా గానీ, ఎంపీగా గాని, మరి ఇతర పోస్టుల్లో గానీ ముస్లిం నేతలు లేరు. ఇటీవల కేంద్ర మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నక్వి రాజీనామా చేశారు.
-నాడు అద్వానీ, జోషికి ఉద్వాసన
2014లో ప్రధానమంత్రి అయ్యాక నరేంద్ర మోడీ పార్టీపై పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. తర్వాత మార్గదర్శక మండల్ అని ఏర్పాటు చేసి, అందులో సభ్యులుగా నియమించారు. అనంతర కాలంలో బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులైన సుష్మ స్వరాజ్, అనంత కుమార్, అరుణ్ జైట్లీ కన్నుమూశారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. థాపర్చంద్ గెహ్లో త్ కర్ణాటక గవర్నర్ గా వెళ్లారు. ఇక అప్పటి నుంచి కొత్తవారిని నియమించలేదు. అయితే రాజ్నాథ్ సింగ్ వివాద రహితుడు కావడం, ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారు. తర్వాత అమిత్ షాను జాతీయ ప్రధాన కార్యదర్శి చేసి, ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. తదనంతర కాలంలో జాతీయ అధ్యక్షుడు కావడానికి రాజ్నాథ్ సింగ్ మార్గం సుగమం చేశారు. అయితే రాజ్నాథ్ సింగ్ మోడీకి ప్రత్యామ్నాయం కాకపోవడం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పార్లమెంటరీ బోర్డులో ఆయన పదవి పదిలంగా ఉంది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది.
-పార్లమెంటరీ బోర్డు సభ్యులు వీరే
జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, లక్ష్మణ్, యడ్యూరప్ప, సోనోవాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్య నారాయణ్ జతియా, బీఎల్ సంతోష్. వీరితోపాటు భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవిస్, ఓం మాథూర్, వసతి శ్రీనివాసన్ సభ్యులుగా ఉంటారు.
Also Read:Recession: మరో మాంద్యం తప్పదా..? అమెరికా కుదేలు.. భారత్ పరిస్థితి ఏంటి?