
Bandi Sanjay – MP Aravind : ‘ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా.. ముద్దు పె ట్టుకుంటారా’ అంటూ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసి నాలుగురోజులయిన తర్వాత, భారత రాష్ట్ర సమితి నాయకులు ఒక ప్లాన్ ప్రకారం అంటే.. శనివారం కవిత ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట కూడా నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ వాడుక భాష వాడినందుకే నానా యాగీ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ మహిళా కమిషన్.. గతంలో కేసీఆర్, కేటీఆర్ మా ట్లాడిన మాటలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. గతంలో వారు మాట్లాడిన మాటల తాలూకూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఇదంతా జరుగుతుండగానే కవితకు బద్ధ శత్రువైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆమెకు బాసటగా నిలిచారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా అర్వింద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. గతంలోనూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. తాజాగా అర్వింద్ కూడా అదే స్వరం అందుకోవడంతో పార్టీలో ఏదో జరుగుతోంది అనే సంకేతాలు విన్పిస్తున్నాయి. అర్వింద్ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు ఆదివారం కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. పలుచోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నీ భార్య, తల్లిని ముద్దు పెట్టుకుం టే ఊరుకుంటావా’ అంటూ ఆగ్రహంగా మాట్లాడాడు. మరోవైపు ఈడీ విచారణ విషయాన్ని బీఆర్‌ఎస్ డైవర్ట్ చేసేందుకు విఫలయత్నం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణులు చేసిన ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘సారా దందా చేసిందే కాక, ఇప్పుడు తెలంగాణలో నిరసనలు చేయడం ఏంటని’ ప్రశ్నిస్తున్నారు.