https://oktelugu.com/

బండి సంజయ్ పోతిరెడ్డిపాడు దీక్షతో బీజేపీలో వర్గపోరు

పోతిరెడ్డిపాడుకు శ్రీశైలం జలాల తరలింపు విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఒక రోజు పాటు చేపట్టిన నిరసన దీక్ష పార్టీలో అంతర్లీనంగా నెలకొన్న వర్గపోరును తెరపైకి తీసుకు వచ్చిన్నట్లు అయింది. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ లవలె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందరిని కలుకుపోయే ప్రయత్నం చేయడం లేదనే […]

Written By: , Updated On : May 15, 2020 / 12:49 PM IST
Follow us on

పోతిరెడ్డిపాడుకు శ్రీశైలం జలాల తరలింపు విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఒక రోజు పాటు చేపట్టిన నిరసన దీక్ష పార్టీలో అంతర్లీనంగా నెలకొన్న వర్గపోరును తెరపైకి తీసుకు వచ్చిన్నట్లు అయింది.

గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ లవలె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందరిని కలుకుపోయే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు పార్టీ వర్గాల నుండి చెలరేగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా కొద్దీ రోజులుగా అన్ని కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా సంజయ్ జరుపుతున్నారు. ప్రతి కార్యక్రమంలో కొందరు పార్టీ ప్రముఖులు పాల్గొంటూనే ఉన్నారు.

అయితే ఈ నిరసన దీక్షలో ఆయన తప్ప మరెవ్వరు పాల్గొనలేదు. పాత మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులను కూడా తమ ఇళ్లవద్ద నుండే నిరసన జరపమని కోరినా చెప్పుకోదగిన స్పందన కనిపించలేదు.

పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జిఓ తీసుకు వచ్చినప్పుడు సంజయ్ అసలు స్పందించలేదు. మొదటగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తర్వాత డా. కె లక్ష్మణ్ స్పందించారు. కేసీఆర్, జగన్ లాలూచి పడినట్లు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఒక రోజు నిరసన దీక్ష చేపట్టాలని మాజీ మంత్రి డి కె అరుణ సంకల్పించారు.

అప్పటి వరకు మౌనంగా ఉన్న సంజయ్ హడావుడిగా రంగ ప్రవేశం చేసి తానే దీక్ష చేస్తానని ప్రకటించడం పార్టీలో పలువురు సీనియర్ నాయకులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ విషయమై మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకులు చేస్తే ఎక్కువ ప్రభావం ఉండేదని, కానీ తానొక్కడే ప్రచారం పొందాలని ఈ విధంగా చేసారని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ దీక్షతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా లాక్ డౌన్ సమయంలో బాధ్యతలు చేపట్టిన సంజయ్ కుమార్ ధోరణి పట్ల బిజెపి వర్గాలలో అప్పుడే రుసరుసలు బయలుదేరాయి. అందరిని కలుపుకు పోకుండా కేవలం సోషల్ మీడియాలో, మీడియాలో ప్రతి రోజూ వార్తలలో నిలవడం పట్లనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

కరీంగర్ నగరంకే పరిమితమైన బండి సంజయ్ కు రెండు సార్లు కార్పొరేటర్ గా ఎన్నికై, మరో రెండు సార్లు ఎమ్యెల్యే అభ్యర్థిగా ఓటమి చెంది, రెండో స్థానంలో ఓట్లు తెచ్చుకున్న రాజకీయ అనుభవం మాత్రమే ఉంది. అయితే గత ఏడాది మోదీ ప్రభంజనంలో, కాంగ్రెస్ అభ్యర్థి బలహీనుడు కావడంతో టి ఆర్ ఎస్ వ్యతిరేక ఓట్లు ఒక్కటిగా పడడంతో ఎంపీగా గెలుపొందారు.

ఎప్పడూ రాష్ట్ర స్థాయిలో బీజేపీలో ఎటువంటి బాధ్యతలు నిర్వహించిన అనుభవం లేదు. రాష్ట్ర అధ్యక్క్ష పదవి కోసం కాంగ్రెస్ నుండి వచ్చిన మాజీ మంత్రి డి కె అరుణ, టి ఆర్ ఎస్ నుండి వచ్చిన బిజెపి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి ఎందరి సీనియర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆర్ ఎస్ ఎస్ మద్దతుతో పార్టీలో చెప్పుకోదగిన బలం లేకపోయినా సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది.

అయినా ఇప్పటి వరకు అందరిని కలుపుకొని, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం గురించి ఒక కార్యాచరణ రూపొందించే ప్రయత్నం గాని, సంస్థాగతంగా పార్టీని పటిష్ట పరచే ప్రణాళిలు రూపొందించడం పట్ల గాని దృష్టి సారించినట్లు కనబడటం లేదు.