AP BJP: వైసీపీ సర్కారుపై బీజేపీ పోరాటం షురూ చేయనుందా? ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందా? ఢిల్లీ వర్గాల నుంచి ఏపీ బీజేపీ నాయకులకు ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా? ఇక పోరాటమే శరణ్యంగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ వరుస కార్యక్రమాలు చూస్తుంటే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా 13 వేల గ్రామాల్లో బీజేపీ నేతలు పాదయాత్ర చేస్తామని ప్రకటించడంతో అధికార వైసీపీలో కలవరం రేపుతోంది. ఉన్నపలంగా ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో రాష్ట్ర బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటనకు సంబంధించి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ కార్యక్రమాలపై వైసీపీ ముద్ర ఉండకుండా చూడాలని ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను వైసీపీ హైజాక్ చేస్తూ వస్తోంది. అందుకే ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నా… దానిని వైసీపీ నేతలు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రధాని విశాఖ పర్యటనను తమ సొంత పార్టీ కార్యక్రమంలా వైసీపీ నేతలు మార్చేశారు. అటు రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మించి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా అవి జగన్ పై అభిమానంతో చేస్తున్నవేనన్న ప్రచారం ఉంది. దీనికి బీజేపీలోని వర్గాలే కారణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అచేతనం చేయాలన్న ఉద్దేశ్యంతో కొందరు సొంత పార్టీ నాయకులే ఈ ప్రచారానికి తెగబడ్డారు. తెర వెనుక ఉండి రాజకీయ డ్రామాను ఆడిస్తున్నారు. దీనిపై హైకమాండ్ కు నివేదికలు వెళ్లడంతో ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీపై సీరియస్ గా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అందుకే ఒక లైన్ ఇచ్చి జగన్ సర్కారుపై పోరాటం చేయాలని ఆదేలిచ్చారుట.
గత ఎన్నికల తరువాత తొలిసారిగా అమిత్ షా ఏపీలో రాజకీయ పర్యటన చేస్తున్నారు. అంతకంటే ముందుగానే ఏపీ బీజేపీ నేతలను అలెర్ట్ చేశారు. దీంతో 13 వేల గ్రామాల్లో బీజేపీ నేతలు పాదయాత్ర చేసేందుకు డిసైడ్ అయ్యారు. పాదయాత్రల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పాదయాత్రల్లో బీజేపీ నేతలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలను హైలెట్ చేసుకొని జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. అమిత్ షా పర్యటన సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే బీజేపీ తాజా వ్యూహంతో వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.

అయితే రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై పతాక స్థాయిలో పోరాటం చేసే సమయంలో అటు జగన్ నీరుగార్చుతూ వస్తున్నారు. తరచూ ఢిల్లీ పెద్దలను కలిసి తమంతా ఒక్కటేనన్న సంకేతాలిస్తున్నారు. ఇది ఏపీ బీజేపీ నేతలకు ప్రతిబంధకంగా మారింది. కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు జగన్ లీకులిచ్చి మరీ ఏపీలో బీజేపీ ప్రయత్నాలపై నీరు పోస్తున్నారు. అటు ఏపీలో బీజేపీ నేతలు సైతం వర్గాలుగా విడిపోయారు. కొందరు వైసీపీకి అనుకూలంగా.. మరికొందరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పనులు చక్కబెట్టుకుంటున్న వారు వైసీపీకి ఫేవర్ చేస్తున్నారని.. టీడీపీ నుంచి అవసరాల కోసం వచ్చేవారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా నడుచుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నవారు మాత్రం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో వైసీపీ సర్కారుపై పోరాటానికి భారీగానే ప్లాన్ చేశారు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.