Telangana BJP: తెలంగాణలో అభ్యర్థులందరిని ప్రకటించి ముందున్న బీఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇటు కాంగ్రెస్ కూడా తొలి జాబితా విడుదల చేసి ప్రచారం ముమ్మరంగా చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కమలదళం ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో శుక్రవారం బీజేపీ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మొదటి జాబితాలో 70 స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేయనున్నట్లు తెలుస్తోంది.
సాయంత్రం ఎన్నికల కమిటీ భేటీ..
శుక్రవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం భేటీ కానుంది. ఈ సమావేశం తర్వాత తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై గురువారం ఢిల్లీలో వరుసగా సమావేశాలు జరిగాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
బలమైన స్థానాలు.. అభ్యర్థుల బలాలపై చర్చ..
గురువారం జరిగిన సమావేశాల్లో తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్న స్థానాలపై ప్రధానంగా చర్చించారు. అక్కడి నుంచి ఎంతమంది టికెట్ ఆశిస్తున్నారు. వారి బలాబలాలు ఏంటి.. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రచారం ఎలా చేయాలనేదాని కూడా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర మంత్రుల పర్యటనలు, ప్రచారం గురించి కూడా చర్చించారు. తెలంగాణ అనుసరించాల్సిన ప్రణాళికపై రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్ఠానం పెద్దలు దిశానిర్దేశం చేశారు.
సభలు, ర్యాలీలకు ప్రణాళిక..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఏర్పాటు, ఎక్కడ భారీ ర్యాలీలు నిర్వహించాలనేదాని కూడా చర్చించారు. అలాగే మేనిఫెస్టోపై కూడా పార్టీ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత రాలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గత విషయమని కిషన్‌రెడ్డి అన్నారు. ఆయనపై సస్పెన్ ఎత్తివేస్తే ఆయన పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.
ఎంపీలందరూ బరిలో..
ప్రస్తుతం బీజేపీ ఎంపీలంతా పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అయితే కొంతమంది ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కానీ అధిష్టానం మాత్రం బరిలో నిలపాలని భావిస్తోంది. కిషన్‌రెడ్డి అంబర్‌పేట, బండి సంజయ్ కరీంనగర్, అర్వింద్ కోరుట్ల, సోయం బాపూరావు బోథ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.