
భారతదేశంలో ఇన్నాళ్లు సంప్రదాయ ప్రచారం సాగేది. అంటే బహిరంగ సభలు.. రోడ్ షోల ద్వారా నేతలు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు దేశంలో అందరి చేతిలోకి స్మార్ల్ ఫోన్లు వచ్చేశాయి. డిజిటల్ విప్లవం వచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీ సారథ్య బాధ్యతలు మోడీ తీసుకున్నాక దేశంలో ఈ ఆన్ లైన్, సామాజిక వేదికల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. హోరెత్తించారు. ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లనే ఆయుధంగా ఎంచుకున్నారు.
ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ నుంచి బీజేపీ కేంద్రమంత్రులు, చివరకు ఎమ్మెల్యేలకు కూడా సోషల్ మీడియా పెను సాధనమైంది. ఇప్పుడు దానితోనే వారంతా ప్రత్యర్థులపై యుద్ధం చేస్తున్నారు.
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ విద్వేశవ్యాఖ్యలు చేసినా.. ఓటర్లను ప్రభావితం చేసేలా చేసినా ఫేస్ బుక్, ట్విట్టర్ లు వెంటనే చర్యలు తీసుకొని వాటిని డిలీట్ చేస్తున్నాయి. కానీ భారత్ లో అలాంటి సందర్భం ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలు లొంగిపోయాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ప్రఖ్యాత అమెరికన్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ బాంబు పేల్చింది.
భారతదేశంలో పాలక బీజేపీ నేతలు విచ్చలవిడిగా విద్వేశపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. కానీ ఇదే ఫేస్ బుక్ వాట్సాప్ లు చూసీ చూడనట్లు వదిలేస్తుందని.. చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’లో సంచలన కథనం ప్రచురితమైంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రవ్యాఖ్యలను కూడా ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో ప్రస్తావించింది. భారత్ లో తన వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్ బుక్ ఇలా చేస్తోందని ఆ కథనంలో రాశారు. ఇది పెను సంచలనమై దేశంలోని పలు పత్రికలు, వెబ్ సైట్లు ఇదే విషయంపై బీజేపీపై విమర్శలు చేశాయి.
తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లను నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ఫేస్ బుక్, వాట్సాప్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అదుపులో ఉన్నాయి. ఫేక్ న్యూస్ ను, విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీకి సహకరిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి’ అని ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే బీజేపీ ‘సోషల్ యుద్ధాన్ని’ ప్రారంభించిందని అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీకి ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలు భయపడుతున్నాయి. తమ వ్యాపార ప్రయోజనాల కోసం వారి వ్యాఖ్యలను తీసివేయడం లేదు.. చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే రాహుల్ సహా పత్రికలు, వెబ్ సైట్స్ కథనాలు ఆరోపించినట్టు సోషల్ మీడియా ఇప్పుడు బీజేపీకి బానిసగా మారిందా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. బీజేపీకి పావుగా ఫేస్ బుక్, వాట్సాప్ మారాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి..