BJP- TDP: తెలుగుదేశం పార్టీ విషయంలో బీజేపీ పెద్దల అభిప్రాయం మారుతోందా? బీజేపీ రాష్ట్ర నేతలకు తెలియకుండా కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు నిజమే అనిపిస్తున్నాయి. టీడీపీ అంటేనే ఉవ్వెత్తున ఎగసిపడే బీజేపీ పెద్దలు ఇప్పుడిప్పుడే సానుకూలంగా మారడం హాట్ టాపిక్ గా మారింది. అల్లూరి విగ్రహావిష్కరణ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు వరకూ నడిచిన ఎపిసోడ్ చూస్తుంటే వద్దు వద్దు అంటూనే టీడీపీ వైపు బీజేపీ అడుగులేస్తున్నట్టు పరిణామాలు తెలియజేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన టీడీపీ, బీజేపీ మైత్రి మూడేళ్ల పాటు సవ్యంగా సాగింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో సైతం ఇరు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి. కానీ జగన్ ట్రాప్ లో పడిన టీడీపీ బీజేపీని దూరం చేసుకుంది. ఆ పార్టీతో విభేదించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కట్టింది. నాడు ప్రధాని మోదీతో పాటు బీజేపీకి చంద్రబాబు గట్టి సవాళ్లనే విసిరారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. బీజేపీ మాత్రం పూర్తిస్థాయి మెజార్టీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీని దూరం చేసుకొని మూల్యం చెల్లించుకున్నానని చంద్రబాబు గుర్తించారు. అప్పటి నుంచి మౌనాన్ని ఆశ్రయించారు. టీడీపీ, బీజేపీల మధ్య అప్పటి నుంచి ఎటువంటి సంబంధాలు లేవు. కానీ చంద్రబాబు తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ మోదీ, షా ద్వయం మాత్రం కనికరించడం లేదన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి బీజేపీ ఎనలేని ప్రాధాన్యమిస్తూ వస్తోంది.

భీమవరం ఎపిసోడ్ తో..
కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీజేపీ టీడీపీకి దగ్గరైనట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలుత భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందింది. పార్టీ తరుపున ప్రతినిధిని పంపాలని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే మూడేళ్ల తరువాత బీజేపీ నుంచి వచ్చిన తొలి సానుకూల పరిణామం ఇదే. దీంతో చంద్రబాబు కూడా సంతోషించారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి కూటమి కడతామని బీజేపీ పెద్దలకు చెప్పుకొచ్చారు. కానీ అక్కడితో ఆగకుండా కూటమి సీఎం అభ్యర్థి పవన్ ను ప్రకటించాలని వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ దూరం జరిగిపోయింది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించాలనే సంస్కృతి బీజేపీలో లేదని సైలెంట్ అయిపోయారు. దీంతో కూటమి అంశం కాస్తా సైడ్ అయిపోయింది. అయితే ఎన్డీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. అటు వైసీపీ నాయకులతో పాటు టీడీపీ నాయకులను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మద్దతిచ్చినందుకు దన్యవాదాలు తెలిపారు. అయితే ఆమె వైసీపీ నాయకులను కలవడం కంటే టీడీపీ నేతలనుే కలవడమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఒకే వేదికపైకి..
చాలా రోజుల తరువాత టీడీపీ, బీజేపీ నేతలు ఒకే వేదిక పంచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీతో కలిసి నడిచేందుకు ఇష్టం లేని సోము వీర్రాజు సైతం చంద్రబాబుతో వేదిక పంచుకోవడం విశేషం. ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చంద్రబాబు వేదికపై ఉల్లాసంగా గడిపారు. అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. అయితే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరి నిమిషంలో మద్దతు ప్రకటించిన తీరు, ముర్మును నేరుగా రప్పించుకున్న తీరు మాత్రం అధికార పార్టీని నివ్వెరపరచింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీసీ, టీడీపీ వైరిపక్షాలుగా ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించాయి. అందుకే ఏ ఒక్కర్నీ నొప్పించకుండా ఉండాలన్న ఉద్దేశ్యానికి బీజేపీ వచ్చింది. పైగా ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియక.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా టీడీపీని కూడా కలుపుకెళ్లాలని బీజేపీ పెద్దలు భావించినట్టున్నారు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అటు వైసీపీకి విషయం తెలిస్తే ఎక్కడ అడ్డుకుంటుందోనని చివరి నిమిషం వరకూ జాగ్రత్తపడ్డారు. గోప్యంగా ఉంచారు. అయితే ఇది వైసీపీకి మింగుడుపడని విషయమే అయినా.. బీజేపీ మాత్రం తన మార్కు రాజకీయం చూపింది. టీడీపీని తనతో కలుపుకునే ప్రయత్నం చేసింది.

రాష్ట్ర నేతలకు అనుమానం..
అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలైతే వారిని వెంటాడుతున్నాయి. మరోవైపు మిత్రుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వెళదామని పట్టుబడుతుండడం, బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తుండడాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వైసీపీ రాజకీయ అవసరాలకు పనికొస్తోంది. కానీ రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తుందన్న అనుమానం, ఆందోళనతో కేంద్ర పెద్దలు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ఈ విషయంలో కొరడా ఝుళిపించడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి సమయంలో వైసీపీ ఎదురుతిరిగితే మాత్రం ప్రత్యామ్నాయంగాచంద్రబాబు, పవన్ ను మచ్చిక చేసుకునేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారని రాష్ట్ర నాయకులు అనుమానిస్తున్నారు. ఎలాగైతేనేం బీజేపీ మాత్రం తనకు తెలియకుండానే టీడీపీ కి మాత్రం దగ్గరవుతోంది.