కొత్త అధ్యక్షుడి నియామకంతో ఏపీలో బీజేపీకి ఊపు వచ్చిందని అందరూ అనుకున్నారు. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదేస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోరాడుతున్నారు. ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే.. అలాంటి బీజేపీకి అతి తక్కువ సమయంలోనే కష్టాలు వచ్చిపడుతున్నాయట.
తాజాగా మిత్రపక్షం జనసేన ఇచ్చిన షాక్‌తో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు విరుచుకుపడడమే దీనికి కారణం. ఒక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే అధ్యక్షుడు సోము వీర్రాజుపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. సొంత పార్టీ నేతలు ఢిల్లీకి పంపుతున్న ఫిర్యాదులతో ఆయన సతమతమవుతున్నారు. ఈ సమయంలో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన చేసిన ఏకపక్ష ప్రకటన జనసేనకు ఆగ్రహం తెప్పించింది. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని.. అలాంటిది తమను కనీసం సంప్రదించకుండా ఎలా ప్రకటిస్తారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో జనసేన అధ్యక్షు డు పవన్ కల్యాణ్ అప్రమత్తమయ్యారు. తిరుపతి సీటుపై ఓ కమిటీని వేశారు.
Also Read: మరో కొత్త స్కీం అమల్లోకి తెస్తున్న జగన్
తిరుపతిలో బలమైన సామాజికవర్గం జనసేనకు మద్దతిచ్చే అవకాశం ఉందని, ఓవీ రమణలాంటి వారి విషయంలో వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు ఆ వర్గానికి నచ్చలేదని సదరు కమిటీ తేల్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతిలో 2009లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడాన్ని ప్రస్తావించింది. రాష్ట్రానికి హోదా గురించి బీజేపీ అక్కడే హామీ ఇచ్చి.. మాట మార్చడం, తిరుపతి అభివృద్ధి అంతా తామే చేశామని కమలనాథులు చెబుతున్నా తిరుపతికి ఒక్క అంతర్జాతీయ విమానం లేకపోవడం, ఐఐటీ ఇచ్చినా సొంత భవనాలకు నిధులు మంజూరు చేయకపోవడం లాంటివన్నీ జనసేన కమిటీ గుర్తించింది.
Also Read: జగన్, బాబులకు బీజేపీ చెక్ పెట్టబోతోందా..?
బీజేపీ పోటీ చేసినా ప్రజలు ఆదరించే అవకాశం లేదని, మనమే అభ్యర్థిని బరిలో నిలుపుదామని.. గెలుపు సంగతి పక్కన బెట్టినా కేడర్‌లో ఊపు వస్తుందని అంచనా వేసింది. కమిటీ ఇచ్చిన సమాచారంతో స్థానిక నేతలకు పవన్ సిగ్నల్ ఇచ్చారు. జనసేన అభ్యర్థే బరిలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో మీడియా ముందుకొచ్చిన జనసేన నేత కిరణ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ఉమ్మడి అభ్యర్థిని జేపీ నడ్డా, పవన్ చర్చించి ప్రకటిస్తారు తప్ప.. పోటీచేసేది ఎవరో వీర్రాజుకు కూడా తెలియదని స్ప ష్టం చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్