Delhi CM Rekha Gupta: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో బిజెపి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఎంతోమంది పేర్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో వినిపించాయి. అయితే చివరి వరకు ఈ విషయంలో బిజెపి అధిష్టానం గోప్యత పాటించండి.. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడానికి ఒకరోజు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును వెల్లడించింది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బిజెపి అభ్యర్థి రేఖ గుప్తాను (Rekha Gupta) ఢిల్లీ ముఖ్యమంత్రిగా బిజెపి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. గురువారం రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ పరిపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.
సీఎం ఎంపికకు..
ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బిజెపి అధిష్టానం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బిజెపి జాతీయ కార్యదర్శి ఓపి ధన్కర్ ను నియమించింది. వీరంతా కూడా ఢిల్లీ ఎమ్మెల్యేలతో ఇటీవల సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయాన్ని కూడా వారి ముందు ఉంచారు. అయితే అంతిమంగా రేఖ గుప్తను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలై నేటికి 12 రోజులు కావస్తోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని ఇంతవరకు బిజెపి అధిష్టానం ప్రకటించలేదు. బిజెపి శాసనసభ పక్ష సమావేశం జరిగే ముందు కూడా చాలామంది పేర్లు వినిపించాయి. వాస్తవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ.. ఆ పేరు బయట పెట్టకుండా చాలావరకు గోప్యత ను పాటించింది. ఆ తర్వాత ఒక కమిటీని నియమించి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని.. అధిష్టాన నిర్ణయాన్ని కూడా వారికి చెప్పి.. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఒకరోజు ముందు ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని బయటకు వెల్లడించింది.. రేఖ గుప్త పేరు బయటకు వెల్లడించిన తర్వాత ఒక్కసారిగా ఆమె జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో.. ఆమె గురించి జాతీయ మీడియా అనేక కథలనాలను ప్రసారం చేస్తోంది.. రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె అనుచరులు ఢిల్లీ బిజెపి కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు వినిపించడం.. జైలుకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అతిషిని ముఖ్యమంత్రిగా నియమించారు. బిజెపి కూడా మహిళకే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడం విశేషం.