1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు మిన్నంటాయి. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్థాన్‌లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ ప్రజలు మాత్రం తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు.
Also Read: కరోనా మీద తెలంగాణ సీఎం కాకిలెక్కలు?
నాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురేస్తానని ప్రగల్భాలు పలికాడు. అలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోవడం తప్పదని అప్పటి హోంమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపడంతోపాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్ యాక్షన్’ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకే సెప్టెంబరు 17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా పాటిస్తారు.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత ఉమ్మడి రాష్ట్రం నుంచే డిమాండ్ ఉంది. కానీ.. అప్పటి ప్రభుత్వాలు పెద్దగా లెక్కచేయలేదు. ఏనాడూ అధికారికంగా నిర్వహించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో ప్రస్తుతం సీఎం కేసీఆర్ ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం’ అంటూ ఆ టైంలో గర్వంగా చెప్పుకొచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగబట్టి ఆరేళ్లు అవుతోంది. కానీ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇంతవరకు అధికారికంగా నిర్వహించలేదు. అసలు దాని మీద కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. మరో ఆరు రోజుల్లో తెలంగాణ విమోచనం రాబోతోంది.. కనీసం ఈసారైనా అధికారికంగా నిర్వహించాలి బీజేపీ పట్టుబడుతోంది.
Also Read: కరోనా : మన చదువుల క్యాలెండర్ కు దెబ్బ
ఇందులో భాగంగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. కానీ అసెంబ్లీ ముట్టడికి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. జిల్లాల నుంచి రాష్ట్రానికి చేరుకోకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోనూ నాయకులను కదలనివ్వలేదు. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ని కూడా అరెస్ట్ చేశారు. అయితే.. మిత్రపక్షమైన ఎంఐఎంకు భయపడే టీఆర్‌ఎస్ గవర్నమెంట్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అవును.. మరి ఏళ్లుగా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు పార్టీలు పోరాడుతున్నా కేసీఆర్ ఎందుకు జరపడం లేదు..? ఎక్కడ ఎంఐఎం పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుందని అనుమానమా..? పొత్తు నుంచి తప్పుకొని ఏ ఇబ్బందులు సృష్టిస్తుందోనని భయమా..? ఇదీ ప్రస్తుతం ప్రతిపక్షాలు విసురుతున్న ప్రశ్నలు. మరి అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికైనా కేసీఆర్ ఏదైనా ప్రకటన చేస్తారో చూడాలి.