హెడ్డింగ్ రివర్స్ లో ఉందని అనుకుంటున్నారా? అదేం కాదు. మీరు చదివింది కరక్టే! అవునా..? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి జగన్ పై ఆధారపడాల్సిన అవసరం ఏంటీ అంటున్నారా? అవసరం ఉన్నది కూడా కేంద్రంలోనే! ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
లోక్ సభలో బీజేపీది తిరుగులేని బలం. ఏకపార్టీగా ప్రభుత్వాన్ని నడిపే సీట్లు ఉన్నాయి. కానీ.. రాజ్యసభకు వచ్చే సరికి లెక్కలో తేడా ఉంది. పెద్దల సభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. ఇందులో ఏదైనా బిల్లు నెగ్గాలంటే కనీసం 123 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ.. బీజేపీకి ప్రస్తుతం ఉన్న బలం 93 మాత్రమే. అంటే.. సరిగ్గా 20 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. దీంతో.. ఇతర పార్టీల మద్దతు బీజేపీకి అనివార్యమవుతోంది.
ఇక, మరో విషయం ఏమంటే.. 2022లో దాదాపు 70కి పైగా రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందిన వారే ఉండడం గమనార్హం. అంటే.. బీజేపీ బలం రాజ్యసభలో మరింతగా తగ్గబోతోంది! ఈ సీట్లన్నీ భర్తీ చేసుకునే అవకాశం బీజేపీకి లేదు.
ఏపీ విషయం చూసుకున్నప్పుడు.. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఏపీకి చెందినవారు కాగా.. గరికపాటి రామ్మోహనరావు తెలంగాణ కోటా నుంచి ఉన్నారు. వీరందరూ వచ్చే ఏడాది రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఈ సీట్లన్నీ వైసీపీకి దక్కబోతున్నాయి. ఆ విధంగా రాజ్యసభలో వైసీపీ బలం మరింత పెరగనుంది.
అటు ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లోనూ బీజేపీ స్థానాలు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే అక్కడి సీట్లు తగ్గిపోతాయి. ఇటు రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ బలం ఉంది. కాబట్టి.. ఇక్కడి నుంచి ఖాళీ అయిన స్థానాలు కూడా బీజేపీకి దక్కే పరిస్థితి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఓటింగ్ కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందులో వైసీపీ ముందు వరసలో ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా బీజేపీ జగన్ పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోందని అంటున్నారు. ఇటు జగన్ కు కూడా కేంద్రం సాయం అవసరమే. దీంతో.. ఇద్దరూ అవసరాలను బట్టి జంటగానే ముందుకు సాగే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.