JP Nadda -Nithin: మొన్న ఎన్టీఆర్ తో అమిత్ షా భేటి.. నేడు హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటి.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తెలంగాణకు వచ్చి సినీ హీరోలతో ఎందుకు భేటి అవుతున్నారు చెప్మా అని అందరూ ఆరాతీస్తున్నారు. అసలు విషయం ఏంటి అని తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ భేటి వెనుక అసలు కారణం ఏంటన్నది ఆరాతీస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటిలో ఎవరూ లేరు. వారిద్దరు మాత్రమే సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. బండి సంజయ్ సహా అందరినీ బయటకు పంపేశారు. దీంతో ఆ భేటి లో ఏం జరిగిందన్నది బయటకు రాలేదు. కానీ నితిన్ తో జేపీ నడ్డా భేటిలో ఇద్దరు బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తోపాటు రామచంద్రరావు కూడా ఈ భేటిలో పాల్గొన్నారు.
తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్ని పూసగుచ్చినట్టు బయటపెట్టేశారు.ఆయనకు కడుపు ఉబ్బరంగా ఉందో.. లేక నిజంగానే బీజేపీ ప్లాన్ యేమో కానీ.. నితిన్ ను ఇరికించేశాడు. ‘మోడీ కోసం ప్రచారం చేస్తానని హీరో నితిన్ అన్నాడని.. మోడీని తిరిగి ప్రధానిగా చూడాలనుకుంటున్నారని’ హాట్ కామెంట్స్ చేశాడు. అయితే బయటకు వచ్చిన నితిన్ మీడియాతో మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
జేపీ నడ్డాతో నితిన్ ఏం మాట్లాడారన్నది లక్ష్మణ్ రివీల్ చేశారు. ‘సినీ క్రీడా రంగాలకు చెందిన నితిన్, మిథాలీరాజ్ లను జేపీ నడ్డా కలిశారు. వారిద్దరూ కూడా మోడీ పాలన పట్ల ముగ్ధులయ్యారు.సరైన పాలన అందిస్తున్నట్లు కొనియాడారు. మోడీని కలవాలని ఉందన్నారు. మోడీ కోసం మా సేవలు వినియోగిస్తామని.. పార్టీ కోసం ప్రచారం చేస్తానని నితిన్ అన్నారు. మోడీని తిరిగి ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు’ అని లక్ష్మణ్ తెలిపారు. దీంతో సినీ హీరోలతో భేటి సినిమాల పరంగా కాదని.. ఫక్తు రాజకీయం అన్నది బయటపడింది.
జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటిలోనే ఇదే కోరి ఉంటారని.. కానీ ఎన్టీఆర్ ప్రచారానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతోనే ఆ భేటిని సినీ విశేషాలకే పరిమితం చేసి ఉంటారని టాక్ నడుస్తోంది.
కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ పెద్దలు అక్కడి హీరోలు యష్, సుదీప్ లతో భేటి అయ్యి వారి మద్దతు కోరారు. బీజేపీకి సినీ గ్లామర్ అద్ది ప్రచారం చేయించి గెలిచారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ప్లాన్ అమలు చేస్తున్నట్టు అర్థమవుతోంది.