
దేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు కాబోతోందా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఉన్న కొంగు మండలాన్ని ‘‘కొంగునాడు’’ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పోరాటం మొదలైంది. ఇది కూడా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలో కొనసాగుతుండడం గమనించాల్సిన అంశం. బీజేపీ మిత్ర పక్షం అన్నా డీఎంకే కూడా దీనికి మద్దతు పలుకుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడున్న తమిళనాడులో తాము బలపడడం అంత ఈజీ కాదని భావించిన బీజేపీ.. రాష్ట్ర విభజన ద్వారా అటు వైపు నుంచి నరుక్కురావాలని చూస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.
తమిళనాడు పడమర ప్రాంతంగా ఉన్న కొంగు మండలంలో మొత్తం పది జిల్లాలు ఉన్నాయి. అవి తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూర్, ధర్మపురి, నామక్కల్, సేలం, నీలగిరి, కరూర్, కృష్ణగిరి, దిండుగల్ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 10 లోక్ సభ స్థానాలు, 61 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ చాలా కాలంగా అన్నాడీఎంకే ప్రాబల్యం ఉంది. ఎంజీఆర్ కాలం నుంచి ఇది ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది నిరూపితమైంది. ఓటమిపాలైన అన్నాడీఎంకే 40 స్థానాలు గెలుచుకొని స్పష్టమైన మెజారిటీ సాధించింది. డీఎంకే కేవలం 16 చోట్ల, బీజేపీ రెండు చోట్ల గెలిచాయి.
ఈ ప్రాంతాన్ని తమిళనాడు నుంచి వేరు చేస్తే.. రాజకీయంగా మేలు జరుగుతుందని బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని చెబుతున్నారు. ఎలాగో తమకు బలమైన పట్టు ఉన్నది కాబట్టి.. భవిష్యత్ లో ఆధిపత్యం తమకే దక్కుతుందన్న ఆలోచనతో అన్నా డీఎంకే సైతం మద్దతు పలుకుతోందని అంటున్నారు. డీఎంకే మాత్రం ప్రస్తుతానికి ఏం జరుగుతోందని పరిశీలిస్తోంది.
బీజేపీ మాత్రం సీరియస్ గా తమ పని తాము చేసుకు వెళ్తోందని అంటున్నారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ ఎలా ఉంటే బాగుంటుందని వ్యూహకర్తలతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలా? కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలా? అని కూడా చూస్తున్నారట. కొంగు మండలానికే చెందిన బీజేపీ నాయకుడు మురుగున్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వడం గమనార్హం. ఆయన తన బయోడేటాలో కొంగునాడు, తమిళనాడు అని పేర్కొనడం కూడా గమనించాల్సిన అంశం. అంతా.. సవ్యంగా సాగితే వచ్చే 2024 నాటికే ఈ పని కంప్లీట్ చేయాలని కూడా బీజేపీ చూస్తోందనే ప్రచారం సాగుతోంది.
అయితే.. రాజకీయ పార్టీలు ఆలోచనలు చేస్తున్నాయి సరే.. ఉద్యమ నేపథ్యం ఉన్న తమిళనాడు విభజనకు ప్రజలు అంగీకరిస్తారా? అన్నది ప్రశ్న. ఉత్తరాది ఆధిపత్యాన్ని తాము సహించబోమని ఎన్నోసార్లు తమిళులు తేల్చి చెప్పారు. ఉద్యమించారు కూడా. మరి, ఈ ప్రయత్నానికి ఎంత వరకు సహకరిస్తారు? అన్నది చూడాలి.