
తెలంగాణ రాములమ్మ విజయశాంతికి రాజకీయాలు అచ్చొచ్చేలా లేవు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలను చుట్టి వచ్చిన విజయశాంతి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో ప్రధాన నేతగా కొనసాగుతున్న విజయశాంతి క్షేత్రస్థాయిలో కలిసిపోవడంతో మాత్రం చాలా స్లోగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్రంలో తన జోరును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కూడా తమ మార్క్ చూపించాలని రాష్ట్ర బాస్ కోరుతున్నారు.
అయితే తెలంగాణలో విజయశాంతి బీజేపీకి వెళ్లిన తరువాత కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మెదక్ జిల్లాలో పార్టీ మారే అవకాశం ఉందని అంచనావేశారు. కానీ ఆమె పార్టీ మారిన తరువాత ఎవరు కూడా విజయశాంతిని నమ్ముకుని బీజేపీకిలోకి వెళ్లే ప్రయ్నతం చేయలేదు. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విజయశాంతి విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
విజయశాంతి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. దీని వల్ల పార్టీలో ఆమె విషయంలో అభిప్రాయాలు చాలానే ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనే ప్రయత్నం చేయకపోవచ్చు. దీని కారణంగా సమస్యల తీవ్రత పెరుగుతుంది. నాగార్జున సాగర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థి విషయంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు చర్చలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ లో అడుగుపెట్టి ప్రచారం చేయడానికి విజయశాంతి ముందుకు రాకపోవడంతో ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది. ఇక విజయశాంతి ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు గతకొన్ని రోజులుగా కార్యకర్తల వద్ద ప్రస్తావన తీసుకువస్తున్నా.. ఆమె విషయంలో ఎటువంటి స్పందన కూడా రావడం లేదు. కనీసం ఆమె మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు.