Homeఆంధ్రప్రదేశ్‌BJP Alliance With Janasena: జనసేనతో పొత్తుపై బీజేపీ పీచేముడ్.. అసలు స్టాండ్ ఏంటి?...

BJP Alliance With Janasena: జనసేనతో పొత్తుపై బీజేపీ పీచేముడ్.. అసలు స్టాండ్ ఏంటి? ఏం చేయనుంది?

BJP Alliance With Janasena: ‘ఆలు లేదు చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం’ అన్న చందంగా ఉంది ఏపీలో పొత్తుల వ్యవహారం. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. పొత్తు అనేది గర్భం దాటక ముందే బారసాల ఎలా చేయాలి? పిల్లాడికి ఏం పేరు పెట్టాలి? అన్న చందంగా తెగ హడావుడి నడిచింది. రేపో మాపో ఎన్నికలు, ఆపై అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ విస్తరణ, అధికార సర్దుబాటు, 50,50 ఫార్ములా అంటూ రకరకాల ఊహాగానాలు, పరస్పర సవాళ్ల మాటలు వినిపించాయి. ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. ఇపుడు తీరిగ్గా కూర్చుని పొత్తులు ఎత్తులు అంటూ ఆవేశకావేశాలు పెంచుకోవడం ధర్మమేనా అని బీజేపీ అంశాన్ని లైట్ తీసుకోగా.. పొత్తులపై పార్టీ శ్రేణులు ఎవరూ మాట్లాడవద్దంటూ టీడీపీ హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పొత్తుల మీద ఎక్కువగా మాట్లాడిన జనసేన అయితే ఆ పార్టీల మనోగతాన్ని చూసి షాక్ కు గురైంది. వాస్తవానికి పవన్ వ్యూహాత్మకంగా పొత్తుల విషయాన్ని తెరపైకి తెచ్చారని అంతా విశ్లేషించారు. అందరూ శభాష్ అన్నారు కూడా. ఆయన ఆప్షన్ల మీద ఆప్షన్లు ఇస్తూ ఇతర పక్షాలను కార్నర్ చేశారని కూడా భావించారు. కానీ రాజకీయాల్లో ఆరితేరిన బీజేపీ, టీడీపీ సున్నితమైన ఎత్తుగడతో పొత్తుల మాటను చిత్తు చేసి పారేశాయి. సైలెంట్ మూడ్ లోకి వెళ్లి పొత్తు అంశాన్ని పక్కన పడేశాయి. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు జనసేన ఇపుడు మరో ఎత్తు వేయాల్సిన అవసరం ఏర్పడింది.

BJP Alliance With Janasena
pawan kalyan somu veerraju

అసలు టీడీపీ పొత్తు అశిస్తోందని ఎవరైన చెప్పారా? అగ్ర నాయకత్వం ఎప్పుడైనా ఆశ్రయించిందా? అన్నవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు యథాలాపంగా అన్న మాటలను పరిగణలోకి తీసుకొని పొత్తుల అంశాన్ని జనసేన సీరియస్ గా తీసుకుంది.పొత్తులతోనే కాదు ఏకంగా రేపు శాసనసభా పక్ష సమావేశం ఎల్లుండే సీఎం ప్రమాణం అన్నట్లుగా అధికార వాటా దాకా కథ నడిపేసింది జనసేన. రెండు సార్లు మేము తగ్గాం.. ఈ సారి మీరు తగ్గండి.. రాష్ట్ర ప్రయోజనాల ద్రుష్ట్యా నిర్ణయాలు తీసుకోండి అంటూ సెంటిమెంట్ మాటలు మాట్లాడింది. అయితే ఈ పరిణామాలతో తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోయారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. మంటలు రేపారు. రెండు రోజుల పాటు తిరిగ్గా చూసిన టీడీపీ అధినాయకత్వం తన పెద్దరికాన్ని చూపింది. పొత్తులకు ఇది సమయం కాదు.. అసలు పొత్తు గురించి మాట్లాడేందుకు మీరు సరిపోరంటూ వారి నోరు మూయించింది. జనసేనతో పొత్తు వ్యవహారంపై కావాలనే వ్యతిరేకత పెంచి…తీరా మైలేజ్ వచ్చాక నోరు మూయించిందన్న మాట. గతంలో చంద్రబాబు పర్యటనల్లో కార్యకర్తలు ఏరికోరి పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని నినదించారు. ఇప్పుడదే కార్యకర్తలతో వారి మాటలకే జవాబు చెప్పించారన్న మాట. మొత్తానికి టీడీపీ తన అపర చాణుక్యాన్ని చూపించింది.

Also Read: Mrigasira Karthi: నేడే మృగశిర.. ఈ కార్తె ప్రాముఖ్యత ఏమిటీ? ఆ పేరు ఎందుకొచ్చింది?

తిరుపతి ఉప ఎన్నికల్లో అయితే బీజేపీ చేసిన హడావుడి ఆంతా ఇంతా కాదు. పవన్ సీఎం అని ఏపీ బీజేపీ నేతలు ప్రకటించారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో అడ్డంకులపై బీజేపీ భారీ నిరసన చేపట్టింది. వకీల్ సాబ్ సీనిమా టిక్కెట్ రెట్ల విషయంలో సునీల్ ఢియోధర్ వంటి ప్రముఖులు స్పందించారు. ఏకంగా నిరసనలకు దిగారు. ఇలా నాడు పవన్ ను తెగ పొగిడేసి మా సీఎం అని చెప్పుకున్న వారు ఇపుడు తాపీగా అది జాతీయ నాయకత్వం నిర్ణయించాల్సిన అంశం అంటున్నారు. అంతే కాదు ఎపుడూ ఎన్నికల ముందు సీఎం అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని కూడా చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి కాక బయట పార్టీల వారిని కూడా సీఎం అభ్యర్ధిగా తాము ఏనాడూ ప్రకటించలేదని కూడా గుర్తుచేస్తున్నారు. 24 గంటల్లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ ను ప్రకటించాలన్న జనసేన డిమాండ్ ని చాలా లైట్ గా కమలనాధులు తీసుకున్నారు. అంతే కాదు ఏపీ టూర్ లో ఉన్న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అయితే పొత్తుల గురించి ఎవరూ నోరు విప్ప వద్దు అని నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారుజ. మొత్తానికి కమలం కూడా ఆప్షన్స్ అన్నీ తన అందుబాటులో ఉంచుకోవాలని చూస్తోంది.

BJP Alliance With Janasena
BJP, Janasena

ఇవన్నీ చూస్తూంటే పవన్ కళ్యాణే అనవసరంగా పొత్తుల అంశాన్ని తెచ్చి పరేషన్ అయిపోయారన్న మాట. పొత్తుల అంటూ ముందే పాట పాడితే జనసేనలో చేరేదెవరు? ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఒకరకమైన అభద్రతా భావం ఉండదా? ఇవన్నీ ఆలోచించే టీడీపీ తెలివిగా పొత్తులు ఇపుడు కాదు అని మొత్తం మ్యాటర్ ని సైడ్ చేసేసింది. ఇక బీజేపీ అయతే ఎవరైనా తమ వైపు చివరి నిముషాన చూడకపోతారా అన్న ముందు చూపుతో పొత్తుల మీద ష్ గప్ చుప్ అంటోంది. మరి ఆ రాజకీయ తెలివిడి జనసేనకు కూడా ఉండాలి కదా అన్న చర్చ వస్తోంది. ఇప్పటికైనా కొంప మునిగింది ఏమీ లేదు. పొత్తుల మాటను పెదవుల వద్దనే కాదు హృదయంలో కూడా లేకుండా చేసుకుని జనసేన తన కార్యక్షేత్రంలో దూకుడు చేయడమే ముందున్న కర్తవ్యం.

Also Read:Pakistan Crisis: శ్రీలంక బాటలో పాకిస్తాన్.. దివాళా తీయనుందా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version