
చాలా రోజుల గ్యాప్ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తాజాగా విజయవాడలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, కరోనా పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, పాలనాపరమైన అంశాల గురించి జనసేన – బీజేపీ సమన్వయ సమావేశంలో చర్చించారు. శనివారం రాత్రి విజయవాడలో ఈ సమావేశం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ , బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జి సునీల్ దేవధర్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వం పాలనపరంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా అనుసరిస్తున్న విధానాల మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న అంశంపై చర్చించారు. ఆర్థికపరమైన అంశాల్లో ఏపీ ప్రభుత్వ తీరుతెన్నులు, నిబంధనల ఉల్లంఘనల గురించి కేంద్రానికి ఫిర్యాదులు అందిన నేపథ్యం గురించి ఈ సమావేశంలో చర్చించారు.
కరోనా సెకండ్ వేవ్ మూలంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులపై చర్చించారు. థర్డ్ వేవ్ విషయంలో అప్రమత్తత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
త్వరలో విస్తృత స్థాయిలో మరోసారి సమన్వయ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
