BJP Manifesto 2024: బీజేపీ వికసిత్ భారత్.. మేనిఫెస్టో ఇదే.. వాటికే ప్రాధాన్యం

దేశవ్యాప్తంగా 20 నగరాలలో మెట్రో సేవలు విస్తరించారు. 75 విమానాశ్రయాలు నిర్మించారు. 100కు పైగా స్మార్ట్ సిటీస్ లో 7,800 ప్రాజెక్టులు నిర్మించారు. 80 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 14, 2024 11:48 am

BJP Manifesto 2024

Follow us on

BJP Manifesto 2024: పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలోకి వస్తే అనుసరించబోయే విధానాలను మేనిఫెస్టోలో వివరించారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ ను అవతరింపజేసేందుకు అనుసరించబోయే మార్గాలను బీజేపీ ఈ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందులో కీలక అంశాలు ఏంటంటే..

ఇవీ కీలక అంశాలు..

పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి రాయితీ మీద వంట గ్యాస్ అందిస్తారు. సూర్య ఘర్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు. పేదల కోసం మూడు కోట్ల పక్కా గృహాలు నిర్మిస్తారు. ఈ పదేళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీ చేసిన నేపథ్యంలో.. వచ్చే ఐదేళ్లలో అదే స్థాయిలో నియామకాలు చేపడతారు. యువత, మహిళలు, పేద వర్గాలపై అధికంగా దృష్టి సారించామని ప్రకటించారు. జీ -20 సమ్మిట్ సమర్థవంతంగా నిర్వహించామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కాశీ విశ్వనాధ్, మహా కాళ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు ప్రస్తావించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణ తీసుకొచ్చి.. జీఎస్టీ అమలు చేస్తున్నామని వివరించింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకు వచ్చినట్టు ప్రస్తావించింది. డిజిటల్ లావాదేవీల్లో నెంబర్ వన్ గా నిలిపామని వివరించింది. 7 ఐఐటీలు, 16 ట్రిబుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 విశ్వవిద్యాలయాలను నిర్మించినట్టు ప్రకటించింది. రోజుకు 35 కిలోమీటర్ల వేగంతో హైవేల నిర్మాణం, 2014 నాటికి ఇది కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే ఉండేదని బీజేపీ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 75% మేర ఉపసంహరించినట్టు వివరించింది. కోవిడ్ సమయంలో 2.97 కోట్ల మందిని ఇతర దేశాల నుంచి సురక్షితంగా తీసుకొచ్చినట్టు ప్రస్తావించింది. యుద్ధం, ఇతర సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న 30 వేలకు మందికి పైగా భారతీయులను సూడాన్, ఉక్రెయిన్, లిబియా, యెమెన్ దేశాల నుంచి భారత్ కు తిరిగి తీసుకొచ్చామని ప్రకటించింది.

సాధించిన విజయాలు ఇవీ..

దేశవ్యాప్తంగా 20 నగరాలలో మెట్రో సేవలు విస్తరించారు. 75 విమానాశ్రయాలు నిర్మించారు. 100కు పైగా స్మార్ట్ సిటీస్ లో 7,800 ప్రాజెక్టులు నిర్మించారు. 80 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2047 నాటికి 4,500 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 40,000 సాధారణ రైల్ కోచ్ లను వందే భారత్ స్థాయికి ఆధునికీకరించారు. పీఎం ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 37 కోట్ల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు చేయూత అందించారు. జన్ ధన్ ఖాతాల ద్వారా 51 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించారు. నాలుగు కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలు నిర్మించారు. 11.8 కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన తాగు నీటి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 11 కోట్లకు పైగా రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారు. ఆర్టికల్ 370 రద్దుచేసి జమ్మూ కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేపట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారతదేశాన్ని నిలిపారు. సౌభాగ్య యోజన కింద 100% వీళ్లకు విద్యుత్ కనెక్షన్ అందించారు.

వికసిత్ భారత్ పేరుతో..

వికసిత్ భారత్ పేరుతో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం శాఖ మంత్రి అమిత్ షా, క్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కూడిన బృందం రూపొందించింది. వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించింది. నమో యాప్ వివిధ రూపాల్లో ప్రజల నుంచి సూచనలు తీసుకుంది. మొత్తం 15 లక్షల మంది నుంచి వచ్చిన సూచనలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు.. “పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ” పేరుతో.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో.. బీజేపీ ఆవిష్కరించిన మేనిఫెస్టో దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.