Bitthiri Sathi: ఎన్నికలవేళ ఎన్నెన్నో వింతలు.. మరెన్నో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా అధికార పార్టీని ప్రశ్నించిన వారు.. ఇప్పుడు అందులోకి మారిపోతున్నారు. దర్జాగా కండువా వేసుకొని ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను పొగుడుతున్నారు. పాలకులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ చేరిపోయారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాటలు పాడుతూ మెరుస్తున్నారు.
అప్పట్లో ప్రభుత్వాన్ని నిలదీశారు
కొద్దిరోజుల క్రితం ముదిరాజ్ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈటెల రాజేందర్, బిత్తిరి సత్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి భారత రాష్ట్ర సమితి తీరును విమర్శించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క స్థానంలో కూడా ముదిరాజ్ అభ్యర్థిని ఎందుకు నిలపలేదని ప్రశ్నించారు.. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులకే బిత్తిరి సత్తి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను మించిన తెలంగాణ వాది ఎవరు ఉంటారని ప్రశ్నించారు. గులాబీ పార్టీలో ఎందుకు చేరారని విలేకరులు అడిగితే.. తెలంగాణకు ఇంతకుమించి మంచి చేసే పార్టీ ఏదని ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చారు.. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిలో చేరారు అప్పటినుంచి ఆయన ప్రభుత్వ పథకాలపై వినూత్నంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
మధుప్రియ స్థానాన్ని భర్తీ చేశారా?
తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో వివిధ నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. తక్కువలో తక్కువ రోజుకు మూడు సెగ్మెంట్లలో ఆయన బహిరంగ సభలు నడుస్తున్నాయి. ఈ బహిరంగ సభలో గాయని మధుప్రియ పాటలు పాడుతూ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బిత్తిరి సత్తి మెడిశారు. గుండె మీద కేసీఆర్ పచ్చబొట్టు, కారు గుర్తుకే వెయ్యి ఓటు అనే పాటను పాడుతూ కార్యకర్తలను అలరించారు. బిత్తిరి సత్తి పాట పాడుతున్నంత సేపు కార్యకర్తల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ పరిణామంతో మధుప్రియను పక్కన పెట్టి ఆ స్థానాన్ని రవితో భర్తీ చేశారా అని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరి బిత్తిరి సత్తి పాట ఏ మేరకు భారత రాష్ట్ర సమితికి అనుకూలిస్తుందో డిసెంబర్ 3న తేలిపోతుంది.
View this post on Instagram