Nitish Kumar : అటు మమతా బెనర్జీ సైలెంట్ అయ్యింది. స్టాలిన్ లో ఉలుకూ పలుకు లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో ఆశించినంత వేగం లేదు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలోనే మునిగితేలుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రాన్ని తేజస్వి యాదవ్ కు వదిలేసి అన్ని నితీష్ కుమార్ ఏకంగా ఢిల్లీ మీద పడ్డాడు.. నరేంద్ర మోదిని ఢీ కొట్టాలని చూస్తున్నాడు.. అందుకు ఆయన ఎంచుకున్న తాజా ఆస్త్రం కుల గణన. శనివారం నుంచి బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కుల గణన చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ భారీ ప్రక్రియకు నితీష్ కుమార్ ప్రభుత్వం ఏకంగా ₹500 కోట్లు కేటాయించింది.. ఇందులో భాగంగా వివిధ దశల్లో ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది.. ఈనెల 21 తో ఈ కార్యక్రమం ముగిస్తుంది.

మొదటి దశలో ఇలా
ఇందులో రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల లెక్కను తేలుస్తారు.. రెండో దశ మార్చిలో మొదలవుతుంది.. అని కులాలు, ఉప కులాలు, మతాల వివరాలను అధికారులు ప్రజల నుంచి సేకరిస్తారు.. వారి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి వివరాలను నమోదు చేస్తారు. పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ దశల్లో ఈ సర్వే సాగుతుంది. ఇందుకోసం ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్ ను రూపొందించింది. ఇందులో ప్రాంతం, కులం, కుటుంబ సభ్యులు, వృత్తి, వార్షికాదాయం తదితర ప్రశ్నలు ఉంటాయి..
బ్రిటిష్ హయాంలో..
వాస్తవానికి దేశంలో బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగింది. దేశవ్యాప్తంగా 52 శాతం ఓబిసిలు ఉన్నట్టు అప్పట్లో తేల్చారు. ఆ తర్వాత 1941లో కూడా మరోసారి కుల గణన చేయాలని భావించారు.. కానీ, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అది రద్దయింది.. ఆ తర్వాత, 2011లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో సామాజిక, ఆర్థిక, కుల, జన గణనను చేపట్టింది. కానీ ఆ వివరాలను బహిర్గతం చేయలేదు.. అప్పటినుంచి 1935లో జరిపిన కుల గణన ఆధారంగానే సామాజిక వర్గాల వారీగా లెక్కలను గణిస్తున్నారు. ఇక, దేశంలోనూ కుల గణన చేపట్టాలనే డిమాండ్ ఉంది. బీహార్ ప్రభుత్వం కూడా గతంలో ఇదే విషయం మీద కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే, ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర వర్గాల కులాల వారీగా జనగణన చేపట్టడం లేదని బీహార్ రాష్ట్రానికి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ 2021 లో పార్లమెంటులో తేల్చి చెప్పారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు జన గణన చేశారని, కేవలం ఎస్సీ, ఎస్టిలకు సంబంధించిన వివరాలనే వెల్లడించారని ఆయన తెలిపారు. ఇక కుల గణనపై బీహార్ ప్రభుత్వం 2018, 19 లో ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించింది. గత జూన్లో అఖిలపక్ష సమావేశం కుల గణనకు పచ్చ జెండా ఊపింది.
ఏం జరుగుతుంది?
బీహార్లో ప్రస్తుతం కుల గణన జరుగుతున్న నేపథ్యంలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీహార్ లో బీసీల జనాభా ఎక్కువ. జేడీయూ, ఆర్జేడీ కి చెందిన నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ పార్టీలు బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుల గణన వివరాలను బయటపెట్టాలని నితీష్ భావిస్తున్నారు.. ఒకవేళ అదే జరిగితే ఆ రాష్ట్రంలో నితీష్, తేజస్వి యాదవ్ లబ్ధి పొందుతారు. ఈ కార్డును ఉపయోగించి అక్కడ పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించుకుంటారు.. ఎలాగూ బీహార్ చేసింది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో అదే డిమాండ్ వ్యక్తం అవుతున్నది. ఇది అంతిమంగా మోడీపై ఒత్తిడి తెస్తున్నది. అతడు కూడా అనివార్యంగా దేశవ్యాప్తంగా కుల గణనకు పచ్చ జెండా ఊపాల్సి వస్తుంది. అప్పుడు మరోసారి మండల్ రాజకీయాల వాతావరణం నెలకొంటుంది. అద్వాని రథయాత్ర, బిజెపి కమండల్ రాజకీయాలను నిలువరించేందుకు 1990లో వీపి సింగ్ ప్రభుత్వం మండల్ నివేదికను తెరపైకి తీసుకొచ్చింది. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో కులాలవారీగా గణన చేపట్టినప్పటికీ ఆ వివరాలను బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కూడా ఆ పరిస్థితులు రావద్దనే కుల గణనకు నిరాకరిస్తూ వస్తోంది. అయితే నితీష్ కుమార్ ఢిల్లీలో చక్రం తిప్పాలనే ఉద్దేశంతోనే ఈ కుల గణనకు నడుం బిగించారు. అయితే దీనిని నరేంద్ర మోడీ ఎలా ఎదుర్కొంటారో అనేది వేచి చూడాల్సి ఉంది.