Europe Energy Crisis : మొన్నటి వరకు ఇండియాలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయనే ఆందోళన వ్యక్తమైంది. రేట్లు తగ్గించాలని బీజేపీ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయితే అంతర్జాతీయ సమస్యల కారణంగా రేట్లు తగ్గించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొందరు పెడచెవినపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి యూరప్ దేశాల్లోనూ ఏర్పడింది. అక్కడ ఇంధన ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజల నుంచి పరిశ్రమల వరకు సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో అల్లాడుతున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు..? ఎవరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది..?
యూరప్ దేశాల్లో ఇంధన కొరతకు ముఖ్య కారణం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆధిపత్యం చెలాయించడానికి ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. ఇక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో హైడ్రోకార్బన్ల కొరత ఏర్పడింది. ఇక ఉక్రెయిన్ పై రష్యా ఆధిపత్యం చెలాయించే విషయంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఈ రెండు దేశాలు ఇప్పుడు కాలు దువ్వుతున్నాయి. దీంతో చమురు సంస్థలపై రష్యా ఆధిపత్యాన్ని పెంచుకొని వాటి కొరతను సృష్టిస్తోందని యూరప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: భీమ్లా నాయక్’ రిలీజ్ కి ఏర్పాట్లు చేసేస్తున్నారు !
ఇదిలా ఉండగా రష్యా, యూరప్ దేశాల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రజలపై భారం పడుతోంది. అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంతో యావత్ యూరప్ దేశాలపై ఇంధన భారం పడుతోంది. ఇప్పటికే కరోనా, చలికాలం కారణంగా ఇంధన కొరతతో సతమతమవుతుంటే ఇప్పుడు ఉక్రెయిన్ పోరుతో ఇంధన భారం మరింత తీవ్రమైంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చమురు సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. దీంతో యూరప్లోని సాధారణ ప్రజల నుంచి పరిశ్రమలపై ఇంధన కొరత ప్రభావం తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది.
ఐరోపాలో ఇంధన సంక్షోభం ఏర్పడడానికి రష్యానే కారణమని కొన్ని రోజుల కిందట ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అధిపతి బిరోల్ వ్యాఖ్యానించారు. రష్యా ఇంధన సంస్థ గ్యాస్ ప్రోమ్ గత మూడు నెలల్లో సరఫరా చేసే గ్యాస్ ను 25 శాతం తగ్గించిందని, ధరలు అధికంగా ఉన్నప్పటికీ ఆ సంస్థ సరఫరాను తగ్గించిందన్నారు. అంతేకాకుండా ఐరోపాలో గ్యాస్ నిల్వ చేసేందుకు కూడా సరఫరా చేయడం లేదని, దీంతో ధరలు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 1973-74 తరువాత ఏర్పడిన అతిపెద్ధ ఇంధన సంక్షోభం ఇదేనని తెలిపారు. కాగా పశ్చిమ దేశాల ఇంధన అవసరాలను ఐఈఏ చూస్తుంటుంది. ఇలాంటి సంక్షోభం సమయంలో ముందుగానే హెచ్చరించడం ఐఈఏ పని.
ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసే ‘గ్యాజ్ ప్రోమ్’ సంస్థ రష్యా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీర్ఘకాల ఒప్పందాల ప్రకారం ఈ సంస్థ ధరలు, సరఫరా చేసే మొత్తాన్ని ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అయితే ఐరోపాకు అదనంగా గ్యాస్ సరఫరా చేసేందుకు ‘గ్యాజ్ ప్రోమ్’ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఐరోపాలో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదంతా రష్యా కావాలనే చేస్తోందని యూరప్ ఆరోపిస్తోంది. అయితే మార్కెట్ ఆధారంగా ధరలు నిర్ణయించేలా మార్పులు రావాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇంధన సంక్షోభంపై ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలతో పాటు పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తామని తెలుపుతున్నాయి. ఇటలీ నాలుగు బిలియన్ డాలర్లు, స్వీడన్ 500 బిలియన్ డాలర్లు సబ్సడీలు ప్రకటించాయి. జర్మనీ కూడా పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపద పెరగకపోయినా పరిస్థితుల నుంచి బయటపడితే చాలు అన్న విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: నేహా శర్మ నుంచి హెబ్బా పటేల్ దాకా.. ఆ తప్పు చేసి సినీ కెరీర్ కోల్పోయిన వారు వీరే..