YCP Gadapa Gadapa Program: ఇది సంక్షేమ రాజ్యం. ఇంత మొత్తంలో పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం జగన్ దే. ఆయనకు మీరు రుణపడి ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రకటనలివి. పింఛన్లు తమకు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఏమైనా ధర్మానికి ఇస్తున్నారా? పన్నులు, చార్జీలు వసూలు చేస్తున్నారు కదా? అయినా మాకు ఎప్పటి నుంచో పింఛన్లు వస్తున్నాయి. జగనొచ్చాకే ఇస్తున్నాడా? ఇవి ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. ప్రజాప్రతినిధులు ఒక మాట అనేలోపే ప్రజలు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మూడేళ్లు మీరేమయ్యారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరిట వస్తున్న అధికారపక్ష ఎమ్మెల్యేలను.. మూడేళ్లుగా ఏం చేశారంటూ కండువాలు పట్టుకుని నిలదీస్తున్నారు. ఇంటి పట్టాలు..ఇల్లు .. పింఛన్లు జగన్ ప్రభుత్వంలోనే వస్తున్నాయంటూ గొప్పలు చెప్పబోయిన ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. ‘చాలు చాల్లే .. ఇందిరమ్మకాలం నాటి నుంచీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు… పింఛన్లు కూడా ఇప్పటివి కావు.. జగన్ వచ్చిన తర్వాతే వృద్ధాప్య పింఛన్లు..వితంతు పింఛన్లు ఇవ్వడం ప్రారంభం కాలేదు’’ అంటూ తిరగబడుతున్నారు. అసలు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ ఎదురుతిరుగుతున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం వైసీపీ ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితిని తెచ్చిపెట్టింది.
ప్రశ్నించేవారిపై దాడులు
కొన్ని ప్రాంతాల్లో ఎదురు ప్రశ్నించిన మహిళలపై ఎమ్మెల్యేల అనుచరులు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్న యువకుల్లో కొందరు ఆ అనుచరులను ప్రతిఘటించి మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు. అసలిక్కడకు ఎందుకు వచ్చారంటూ ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలేమైనా ఉంటే చెప్పుకొని వెళ్లిపోండంటూ ప్రజా ప్రతినిధులకు ప్రజలు సలహా ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ‘గడప..’లో ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు. రోడ్లు, మురుగు కాలువలు, తాగు నీటి సదుపాయాల సంగతేమిటని ప్రశ్నిస్తున్న ప్రజలకు ప్రజా ప్రతినిధుల నుంచి సమాధానం రావడం లేదు. తాము చెప్పింది మాత్రమే వినాలంటూ కొందరు ఎమ్మెల్యేలు జులుం ప్రదర్శిస్తున్నారు. చెత్తపైనా పన్ను వేస్తారా అని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై స్థానిక నేతలు సమాధానం ఇవ్వబోతుంటే .. మహిళలు మరింత కోపంతో ఊగిపోతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి చల్లగా జారుకుంటున్నారు.
Also Read: Agneepath Scheme Protest: ‘అగ్నిపథ్’తో రాజుకున్న ఉత్తరాది.. అసలేంటి కారణం?
పెద్ద నాయకులకు సైతం
మొన్నటివరకూ మంత్రి గా వెలగబెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డిని సైతం వదల్లేదు. గడప వరకూ వచ్చిన బాలినేనిని ప్రజలతోపాటు స్థానిక వైసీపీ మహిళా నేతలు సైతం నిలదీశారు. తమ పార్టీ నాయకులపైనే మాజీ మంత్రికి ఫిర్యాదు చేశారు. అనూహ్యంగా ప్రజల నుంచి.. సొంత పార్టీ నేతల నుంచి నిలదీతలు మొద లు కావడంతో.. బాలినేని తీవ్ర అసహనానికి గురయ్యారు. దీని వెనుక టీడీపీ నేత జనార్దన్ ఉన్నారం టూ రుసరుసలాడుకుంటూ వెళ్లిపోయారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను ప్రశ్నించిన పాపానికి ఓ మహిళపై ద్వితీయ శ్రేణి నాయకులు దాడి చేశారు.
ఎమ్మెల్యే అయితే అయ్యన్నపాత్రుడిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. మొన్నటి వరకూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన పాముల పుష్పశ్రీవాణికి సైతం నిలదీతలు తప్పలేదు. ఎన్నికల్లో బ్రిడ్జి కడతామన్నారు కదా.. ఇంతవరకూ ఎందుకు కట్టలేదంటూ ఓ గ్రామస్థులు పొలిమేరల్లో కారు ఆపి వెనక్కి పంపారు. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణపై గిరిజన మహిళలు ఎదురుతిరిగారు. తమ స్థలాన్ని కబ్జా చేశావంటూ చొక్కా పట్టుకుని గుంజారు. దీంతో ఆయన నిశ్ఛేష్టుడై వచ్చిన కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయినంత పనిచేశారు. ఫాల్గుణ గ్రామాల్లో పర్యటిస్తున్నంత సేపూ నిలదీతల పర్వం కొనసాగింది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని .. పింఛన్లు, ఇళ్లు ఇస్తోందంటూ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పబోగా.. అక్కడున్న మహిళలే ఎదురుతిరిగారు. ద్వితీయ శ్రేణి నేతలు కలుగజేసుకుని ఎమ్మెల్యేకు మద్దతుగా ఏదో అనబోగా మరింత ఆగ్రహించారు. ఇందిరమ్మ కాలం ఉంచీ పేదవారికి .. ఎస్సీ , ఎస్టీలకు కాలనీలు నిర్మించి ఇచ్చారంటూ వాదనకు దిగారు. జగన్మోహనరెడ్డి పింఛన్లు ఇస్తున్నారని అనడంతో .. పింఛన్లు తమకు ఎప్పటి నుంచో వస్తున్నాయని .. జగనొచ్చాకే ఇస్తున్నాడా అని మహిళలు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజుకు ఏంచెప్పాలో పాలుపోక మౌనందాల్చారు.
Also Read: BRS TO TRS: బీఆర్ఎస్ తేడా వస్తే టీఆర్ఎస్ కొంపకొల్లేరే.. కేసీఆర్ లో ఆ భయం?