Kaushik Reddy: కౌశిక్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌.. వివాదాస్పద వ్యాఖ్యలపై నివేదిక కోరిన ఈసీ

ఎమ్మెల్సీగా ఉన్న కౌషిక్‌రెడ్డి ఈసారి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. ఒక పదవి అనుభవిస్తూనే కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న కసితో ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 29, 2023 4:42 pm

Kaushik Reddy

Follow us on

Kaushik Reddy: వివాదాలకు కేరాఫ్‌ అయిన ఎమ్మెల్సీ, హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌషిక్‌రెడ్డి. మొదటి నుంచి అగ్రసివ్‌ పాలిటిక్స్‌తో తరచూ వార్తల్లో ఉంటారు. వృత్తిరిత్యా క్రికెటర్‌ అయిన కౌషిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2018లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వెంటనే ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడ్డాడు. కానీ, అనుభవజ్ఞడైన ఈటల రాజేందర్‌ చేతిలో ఓడిపోయారు. ఇక 2021లో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు. కానీ, బీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆకర్షితుడై గులాబీ తీర్థం పుచ్చుకున్నాడు. తర్వాత కేసీఆర్‌ ఆయనను ఎమ్మెల్సీ చేశారు.

ఈసారి అసెంబ్లీ బరిలో..
ఎమ్మెల్సీగా ఉన్న కౌషిక్‌రెడ్డి ఈసారి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. ఒక పదవి అనుభవిస్తూనే కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న కసితో ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నారు. కానీ రాజకీయ నాయకుడికి కావాల్సింది ఆవేశం కాదని, ఆలోచన అన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. సొంత నియోజకవర్గ ప్రజలపైనే తన అనుచరులతో దాడి చేయించడం, కుల సంఘాలను దూషించడం వంటివి చేశారు. ఇక ఎన్నికల్లో బెదిరింపు ధోరణితో ఓట్లు అడగడం మొదలు పెట్టాడు. దీంతో ప్రజల నుంచి మద్దతు లభించకపోగా, వ్యతిరేకత పెరిగింది. దీంతో భార్య, బిడ్డను ప్రచారంలోకి దించాడు. తనవల్ల కాని సెంటిమెంటును వారిలో రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

చివరి రోజు వివాదాస్పద వ్యాఖ్యలు..
ఎన్నికల ప్రచారం చివరి రోజు హుజురాబాద్‌లో రోడ్‌షో చేసిన కౌషిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తనను గెలిపించకపోతో భార్య, బిడ్డతో కలిసి ఉరేసుకుంటానన్నారు. గెలిస్తే విజయ యాత్ర, లేదంటే డిసెంబర్‌ 4న తన శవయాత్ర అంటూ ఓటర్లను ప్రభావితం చేసేలా కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కౌషిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ బుధవారం ఆదేశించింది.