YS Jagan Illegal Assets Case: వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అక్రమాస్తుల కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. కేసులు విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. ఇప్పటికే పదేళ్లుగా జరుగుతున్న విచారణలో ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా సాగుతోంది. ఈ క్రమంలో జడ్జి బదిలీ కావడంతో విచారణ మళ్లీ మొదటికి రానుంది.
-పదేళ్లుగా సా…గుతున్న విచారణ..
జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదై పదేళ్లు అవుతోంది. ఇంత వరకూ ఒక్క కేసు కూడా ట్రయల్ వరకూ రాలేదు. క్వాష్ పిటిషన్లు.. డిశ్చార్జ్ పిటిషన్లు.. వాయిదాల పిటిషన్లు ఇలాంటి వాటితో దశాబ్దం గడిచిపోయింది. ఇప్పుడు సీబీఐ జడ్జిని బదిలీ చేశారు. కొత్త వారిని నియమించారు. సాధారణంగా కొత్త న్యాయమూర్తి వస్తే ఆ కేసులను మళ్లీ మొదటి నుంచి వింటారు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం విచారణ జరుగుతోంది. ఆ శుక్రవారం కూడా ఏదో ఓ కారణంతో వాయిదాకే పోతోంది. న్యాయమూర్తిని మార్చడంతో ఇప్పుడు ఆ కేసుల నిచారణ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు మరోసారి ఆ కేసుల విచారణ మొదటికి రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న విచారణలో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కేసులు మరికొన్నాళ్లు కాకుండా.. కొన్నేళ్ల పాటు సాగే అవకాశం ఉంది. ఈడీ కేసులూ అంతేనని చెబుతున్నారు.
Also Read: TV9 Vishwak sen Viral Video : టీవీ9 స్టూడియోలో విశ్వక్ సేన్ హల్ చల్.. బయటకు గెంటేసిన యాంకర్
-సుప్రీం చెప్పినా పెరగని వేగం..
ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులపై కేసులు.. ముఖ్యంగా తీవ్ర నేరాలు ఉన్న వారి కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపాలని ఆదేశించింది. కొన్ని రకాల కేసులు విచారణలో ఉన్నాయి కానీ అవి ఎన్నికల నేరాల కేసులు. తీవ్ర ఆర్థిక నేరాల కేసులు ఇంకా విచారణకు రావడం లేదు. ఇటీవల ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో సంచలన ఆదేశాలు ఇస్తేం తప్ప.. జగన్ కేసుల విచారణ ఆలస్యం కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-ఎన్వీ రమణ సీజేఐ కాకుండా..
ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ.రమణ కాకుండా జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. దీనికి ఆయన చంద్రబాబు సన్నిహితుడని ఆరోపణలు చేశారు. రమణ సీజేఐ అయితే తనపై ఉన్న సీబీఐ కేసులను వేగవంతం చేస్తారని ఊహించిన జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎవరూ చేయని సాహసం చేశారు. రమణ కుటుంబ సభ్యులు అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో లబ్ధి పొందారని, ఈమేరకు కేసు నమోదైందని, ఈ నేపథ్యంలో ఆయన సీజేఐ అయితే ప్రభావం చూపుతారని కేంద్రానికి లేఖ రాశారు. తన ప్రభుత్వాన్ని ఆయన అస్తిరపరుస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈలేఖ బయట పడడం సంచలనమైంది. కానీ రమణ సీజేఐ కాకుండా ఆపలేకపోయింది. దీంతో జగన్ కేంద్రానికి మరింత లొంగిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-ఒక్కో కేసు నుంచి బయట పడేందుకు..
ఇప్పటికే తనపై నమోదైన కేసుల నుంచి బయట పడేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే ఇందుకు ఉదాహరణ. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు జగన్ బ్రహ్మాస్త్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదం. ఈ నినాదంతోనే ఆయన యువతను ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నరపాటు సాగిన పాదయాత్రలోనూ ప్రత్యేక హోదాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నాడని ప్రజలను నమ్మించగలిగాడు. తనకు ఒక్క చాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని, 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఎవరు వచ్చినా తానే చక్రం తిప్పుతానని హామీ ఇచ్చారు. కానీ అంతా రివర్స్ అయింది. ప్రజలు 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు తానే మెడలు వంచుకుని ప్రధాని మోదీకి వంగివంగి దండాలు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రత్యేక హోదా హామీని పక్క పెట్టి.. తాను అక్రమాస్తుల కేసుల నుంచి బయట పడడమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్రం ఏం చెప్పినా సై అంటున్నారని కౌంటర్లు ఇస్తున్నారు.
ఇంతటి కీలక పరిణామాల నడుమ జగన్ మెడకు ఉచ్చులా ఉన్న కేసుల విషయంలో భారీ ఊరట వచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కావడం జగన్‌కు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. మరోవైపు సుప్రీం సీజే కూడా మరో ఏడాదిలో రిటైర్ కానున్నారు. విచారణ ఎలాగూ కొన్నేళ్లు జరిగే అవకాశం ఉన్నందున రమణ ఉద్యోగ విరమణ అంశం కూడా జగన్‌కు ఆనందం కలిగించే విషయమే..!
Also Read:AP Employees: సీపీఎస్ ఉద్యోగుల దగ్గర కుప్పిగంతులు కష్టమే?