Gujarat CM Bhupendra Patel: అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు.. ఇప్పుడు మోడీని మించిన ఘనుడే గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి భూపేంద్ర పటేల్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.. అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు.. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రికార్డు నే బద్దలు కొట్టారు. అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 సెప్టెంబర్ లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీ ని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్ కు అధిష్టానం పగ్గాలు అప్పగించింది. రూపానీ రాజీనామా తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఎటువంటి నేపథ్యంలేని భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.

మోదీని మించి
2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎడల జరిగిన ఎన్నికల్లో బిజెపి 127 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.. ఇక మోడీకి, భూపేంద్ర పటేల్ కు ఒకసారి ఉంది.. ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే పటేల్ గత ఏడాది తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. అప్పట్లో నరేంద్ర మోడీ కూడా ఎటువంటి బాధ్యత చేపట్టకుండానే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.
పాటిదార్ ఆందోళన నేపథ్యంలో
అప్పట్లో రూపానీ ని దింపి భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రి చేయడం వెనక అప్పట్లో పాటిదారుల ఉద్యమమే కారణమని తెలుస్తోంది. వారి డిమాండ్ మేరకే బిజెపి ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు భూపేంద్ర అత్యంత నమ్మకస్తుడు.. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఘట్లో డియా నియోజకవర్గం నుంచి 2017 లో తొలిసారి పోటీ చేసిన ఆయన 1.17 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శక్తి కాంత్ పటేల్ పై విజయం సాధించారు.. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఈయనే కావడం విశేషం.. తాజాగా జరిగిన ఎన్నికల్లోను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.92 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు.

పాటీ దార్ నుంచి ఐదో ముఖ్యమంత్రి
భూపేంద్ర పటేల్ కు 60 ఏళ్ళు.. అహ్మదాబాద్ లో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేశారు. అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా, పాలక సంఘం స్థాయి సంఘం చైర్మన్ గా, మునిసిపల్ పాఠశాలల కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.. ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన మృదుభాషి.. అందరూ అతడిని దాదా అని పిలుస్తారు.. పటేల్ పై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.. రాజకీయాల్లోకి రాకముందుకు నిర్మాణరంగ వ్యాపారం చేసేవారు..ఆర్ ఎస్ ఎస్ తోనూ అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీలో ఇతడిని ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు.
పటేళ్ళ ప్రాబల్యమున్న స్థానాల్లో ఈసారి బిజెపి ఘనవిజయం సాధించింది. అందుకే రెండోసారి కూడా భూపేంద్ర పటేల్ కు బిజెపి అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది.. పటేల్ వర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఐదవ వ్యక్తి భూపేంద్ర. అంతకుముందు ఆనందీ బెన్, కేశు భాయ్, బాబు భాయ్, చిమన్ బాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రులుగా పని చేశారు.