Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వంపై రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27 సోమవారం బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా బంద్ పాటించేందుకు పలు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పాటించనున్నారు.

కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు తెలిపాయి. బంద్ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ అయ్యాయి. పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాస్తారోకోలు చేస్తున్నారు.
హర్యానా రాష్ర్టంలో బంద్ కొనసాగుతోంది. అంబాలా-నాహాన్ రహదారిని పంజోఖ్రా గ్రామం దగ్గర రోడ్డు ముట్టడించారు. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ బెంగాల్ లో భారత్ బంద్ కొనసాగుతోంది. ఆందోళనకారులు బ్యానర్లు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 30 రైళ్లను రద్దు చేశారు. 18 రైళ్లను దారి మళ్లించారు.
పంజాబ్ లో యూనివర్శిటీ విద్యార్థులు భారత్ బంద్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ గేటు మూసివేశారు. ఖమ్మం జిల్లాలో భారత్ బంద్ కొనసాగుతోంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య, సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో భారత్ బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. రాష్ర్టంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు పార్టీలు బంద్ లో పాల్గొంటున్నాయి. దీంతో పోలీసు బలగాలను మోహరించారు.
ఏపీలో బంద్ పాటిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, వామపక్షాలు బంద్ లో పాల్గొంటున్నాయి. బీజేపీ, జనసేన బంద్ కు దూరంగా ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవీటకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొంటున్నట్లు కార్మికులు ప్రకటించారు. భారత్ బంద్ సందర్భంగా అఖిలపక్షం, మిత్రపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో నిరసన చేశారు. జీడిమెట్ల బస్ డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా గేటు వద్ద మిత్రపక్షాల నాయకులు అడ్డుకున్నారు. మెదక్ బస్ డిపో ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న నాయకులను అరెస్టు చేశారు.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు నిలిపివేశారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొన్ని డిపోలలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హన్మకొండ డిపో ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఏపీలో పంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం జరగాల్సిన శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
భారత్ బంద్ సందర్భంగా లారీలు, ఆటోలు తిరగనివ్వడం లేదని ప్రకటించారు. రవాణా పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీపీజీఈ సెట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సెట్ చైర్మన్, కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేశారు.