Pawan kalyan: ‘తాను భారతీయుడిని.. తనకు కులం లేదని’ గతంలో ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలన సమీకరణాలకు తెరలేపారు. రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు’ ఐక్యంగా పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీసీలు, ఎస్సీలను కలుపుకుంటూ రాజ్యాధికారం సాధించాలంటూ పవన్ దిశానిర్ధేశం చేశారు. పవన్ కొత్త కుల సమీకరణాలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
వైసీపీతో యుద్ధానికి రెడీ అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక తగ్గేది లేదంటూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వైసీపీని ఢీకొట్టలేక ఆపసోపాలు పడుతున్న టీడీపీని భర్తీ చేసే బాధ్యతను పవన్ భుజానకెత్తుకున్నాడు. ఇక జనసేన రోడ్డు మీదకు వచ్చిందంటూ రాజమండ్రి సాక్షిగా పవన్ శ్రమదానం చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ రెడ్లు, టీడీపీ కమ్మలకు ధీటుగా కాపులకు అధికారంలోకి రావాలని వారితో కలిసి బీసీలు, ఎస్సీలను కలుపుకుపోయే కొత్త ఎత్తుగడకు రాజమండ్రి సాక్షిగా పవన్ బీజం వేశారు. రెడ్లు, కమ్మలు బీసీలు, కాపులను తొక్కేయాలను ఉద్దేశంతోనే చూస్తున్నారంటూ ఆ వర్గాల్లో పవన్ నూరిపోశారు. 2009లో ప్రజారాజ్యంతో చేసిన ప్రయత్నం సాధ్యపడలేదని.. ఇప్పుడు కాపులు, తెలగ, బలిజ, ఒంటరికులాలు ముందుకు రావాలంటూ పవన్ ఇచ్చిన పిలుపు ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది.
ఏపీ రాజకీయాల్లో అత్యధిక జనాభా ఉన్నది కాపులు, దళితులే.. కానీ ఏడు దశాబ్ధాలుగా వారికి రాజ్యాధికారం అందని ద్రాక్షే.. బీసీలు, కాపులు ఈ అగ్రవర్ణాలకు బోయిల వలే పల్లకీ మోస్తూనే ఉన్నారు. ఏడు దశాబ్ధాలుగా ఏపీ రాజకీయాల్లో జనాభా ఉండి కూడా ప్రాధాన్యత లేకుండా కాపులు, బీసీలు మగ్గుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త శక్తులు అధికారంలోకి రావాలన్న పవన్ పిలుపు.. పైగా వారి జనాభా అధికంగా ఉన్న గోదావరి జిల్లాల నుంచే పవన్ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఒక ప్రజారాజ్యంతో విఫలమైన పవన్ ఈసారి మాత్రం ప్రాణ పోయినా తన చివరి శ్వాస వరకూ రాజకీయాలు వదలనని మాట ఇవ్వడం కాపుల్లో నిజంగానే ధైర్యాన్ని నింపింది. ఇన్నాళ్లు చుక్కాని లేని నావలా సాగిన కాపులు, బీసీలకు పవన్ ప్రసంగం ఒక దారిని చూపినట్టుగా చెబుతున్నారు. పవన్ కనుక గట్టిగా నిలబడితే అణగారిన వర్గాల ఐక్యత ఫలిస్తే ఏపీ రాజకీయాల్లో ఒక ప్రబలమైన మార్పు తథ్యం. అయితే ఈ కులాలు ఏకం అవుతాయా? శరామాములుగానే కమ్మలు, రెడ్ల ఎత్తులకు చిత్తు అవుతాయా? అన్నదే ఇక్కడ కీలకం..
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ కులాల ఎత్తుగడ ఏపీ రాజకీయాల్లో గొప్ప మలుపు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అనాదిగా ఏపీలో రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారాన్ని పంచుకున్నారు. ఇన్నాల్లు తాను ఒక కులం వాడిని కాదన్న పవన్.. ఇప్పుడు కాపులు, బీసీలను ఏకం కావాలని పిలుపునివ్వడం.. నిజంగానే ఏపీలో కొత్త రాజకీయ శక్తి పుట్టుకకు దారితీస్తుందని.. ఇది టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్మాయంగా నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి పవన్ పిలుపునకు ఆ వర్గం వారు స్పందిస్తారా? కలిసి వస్తారా? అన్నది వేచిచూడాలి.