DRDO Secret tests: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు శత్రువులపై స్పష్టత వచ్చింది. దీంతో భారత్ మరింత అప్రమత్తమైంది. మారిన యుద్ధ రీతులతో సరికొత్త టెక్నాలజీ ఆయుధాలను స్వయంగా తయారు చేయడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో భారీగా బడ్జెట్‌ను కూడా కేటాయించింది. మరోవైపు రష్యా నుంచి ఎస్–500 కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. డ్రోన్ ఆయుధాలు తయారు చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన బ్రహ్మోస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఆయుధ పరీక్షల కోసం గతేడాది డిసెంబర్లో వరుసగా 15 రోజులు నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. తాజాగా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో 3,190 కిలోమీటర్ల విస్తీర్ణంలో విమానాల రాకపోకలు ఆగిపోతున్నాయి. భారత్ జారీ చేసిన నోటామ్(NOTAM) ద్వారా విధించిన ఈ ఆంక్షలు పొరుగు దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్ష?
గత పరీక్షలతో పోలిస్తే ఈసారి నో–ఫ్లై ప్రాంతం గణనీయంగా పెరిగింది. డీఆర్డీవో సముద్ర ఆధారిత లాంగ్ రేంజ్ క్షిపణులు లేదా అధునాతన మిస్సైళ్ల పరీక్షణకు ఇది సిద్ధం చేస్తున్నట్లు నిపుణులు అంచనా. ఈ ప్రయోగాలు భారత సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్నాయి.
పొరుగు దేశాల్లో టెన్షన్..
భారత్ నోటామ్ ప్రకటన పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో టెన్షన్‌ను పెంచింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వేగంగా ముందుకు సాగుతున్న ప్రయోగాలు వారి రహస్య ఆయుధాల అభివృద్ధికి సవాలుగా మారాయి. ఈ టెస్టులు ప్రాంతీయ భద్రతా సమతుల్యాన్ని ప్రభావితం చేస్తాయని వారు భావిస్తున్నారు.
ఈ పరీక్షలు భారత్ సైనిక సాంకేతికతను అధునీకరించడానికి కీలకం. లాంగ్ రేంజ్ ‡ క్షిపణులతో సముద్ర, గగన, భూమి ఆధారిత రక్షణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయి. పొరుగు దేశాల ఆందోళనలు ఉన్నా, ఇది భారత రక్షణ వ్యూహంలో అంతర్గత అభివృద్ధి మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.