ఆంధ్రప్రదేశ్ లో మరోసారి బాక్సైట్ వివాదం రేగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో తెలుగుదేశం పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, కిడారి శ్రావణ్, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి, అనిత, ఈశ్వరి, రాజేశ్వరి బృందం గిరిజనులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది .
రౌతులపూడి మండలం జల్దామ్ నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు వేసినట్లు గుర్తించిన టీడీపీ నేతలు కేవలం లేటరైట్ తరలింపునకే రోడ్డు వేశారని అన్నారు. రోడ్డు విస్తరణలో తమ పొలాలు పోయాయని గిరిజనులు తెలిపారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు జగన్ ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తుందన్నారు. గిరిజనులతో మాట్లాడిన తరువాత మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న టీడీపీ నేతలను తూర్పు గోదావరి జిల్లా దబ్బాలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా మీడియా ప్రతినిధులు, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే నేతలు మాత్రం మీడియా సమావేశం నిర్వహించాకే వెళతామని భీష్మించుకు కూర్చున్నారు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే లేటరైట్ తవ్వకాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల సంపదను కాపాడాలని సూచించారు. అటవీ సంపదను నాశనం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. గిరిజనుల సమస్యలపై ఆరా తీశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాస రావు సిబ్బందితో కలిసి నేతలను కోటనందురు పోలీస్ స్టేషన్ కు తరలించారు.