Bandi Sanjay Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనయ, ఎమ్మెల్సీ కవితను సీబీఐ కవితను విచారణ చేస్తోంది. ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి చేరుకున్న 11 మంది బృందం ప్రత్యేక గదిలో న్యాయవాదుల సమక్షంలో స్టేట్‌మెంట్ రికార్డు చేస్తోంది. అయితే కవిత విచారణపై అటు సొంత పార్టీ నేతలు, సీపీఐ నారాయణ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా విపక్షాల నుంచి సెటైర్లు పేలుతున్నాయి. కవిత నుంచి కేవలం వివరణ తీసుకోవడానికి మాత్రమే సీబీఐ వచ్చినట్టు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అంతకు మించి కవితను ఏమీ చేయలేరని తెలంగాణ అధికార పార్టీ నేతలు వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదిరిపోయే పంచ్ విసిరారు.

చాయ్ బిస్కెట్ల కోసం వచ్చారా?
జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ పరిధిలో ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర చేస్తున్న సంజయ్ లిక్కర్ స్కాంలో కవిత విచారణపై స్పందించారు. స్కాంలో కవితత పాత్రపై తేల్చేందుకు వచ్చిన సీబీఐపై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదిరిపోయే పంచ్ ఇచ్చి కవిత గాలి తీశాడు. బిస్కెట్లు తిని, చాయ్ తాగడానికి సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? అని ఆయన నిలదీశారు. సీబీఐ అధికారులు విచారణకు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. తప్పు చేసిన వారు సిగ్గు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కవితను సింహం, పులి అంటూ కీర్తిస్తున్నారని, అంటే సీబీఐ అధికారులను ఏమైనా చేస్తామని పరోక్షంగా బెదిరిస్తున్నారా? అని ఆయన మండిపడ్డారు.
జాతీయ పార్టీకంటే ముందే జాతీయ అవినీతి..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కూతరు కవిత, ఆయన కొడుకు కేటీఆర్ బీఆర్‌ఎస్‌ను జాతీయస్థాయిలో విస్తరించకముందే తమ అవినీతితో జాతీయస్థాయి లీడర్లయ్యారని ఎద్దేవా చేశారు. ఏ ఆధారాలు లేకుండానే కవితను సీబీఐ విచారిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన ప్రతీ బీఆర్‌ఎస్ నేత జైలుకెళ్లాల్సిందే అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అడ్డంగా దొరికిపోయారని పునరుద్ఘాటించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు చిదంబరం జైలుకెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నీకేం నొప్పి నారాయణ..!
ఇక కవితను సీబీఐ విచారణ చేయడంపై ఎర్రగులాబీ.. సీపీఐ జాతీయ కార్యదర్శికి ఎక్కడ.. ఎవరికీ లేని నొప్పి కలుగుతోంది. అవినీతి, అక్రమాలపై పోరాడాల్సిన ఎర్రజెండా పార్టీ, మద్యం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతు పలుకడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కవిత విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేయడం సొంతపార్టీ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది. గులాబీ పార్టీ నేతలను మించి సీపీఐ నారాయణ మాట్లాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాము కూడా సీపీఐ నేత నారాయణలా డిమాండ్ చేయడం లేదని గులాబీ నేతలే గుసగుసలాడడం గమనార్హం.