Balka Suman: అప్పుడు చెప్పు.. ఇప్పుడు క్రిమినల్.. బాల్క సుమన్ ఇక మారడా

ఇటీవల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుచిత పదాలతో బాల్క సుమన్ ఆరోపించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు అందించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 12, 2024 1:18 pm
Follow us on

Balka Suman: నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది. నోరు ఉంది కదా అని ఎవరి మీద పడితే వారి మీద పారేసుకుంటే ఊరు తిరగబడుతుంది.. ఇప్పుడు ఈ సామెత భారత రాష్ట్ర సమితి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో విమర్శించారని ఆరోపిస్తూ.. బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో ఆవేశంతో ఊగిపోయి రేవంత్ రెడ్డికి చెప్పు చూపించారు. మరొకసారి కెసిఆర్ పై విమర్శలు చేస్తే చెప్పుతో కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో బాల్క సుమన్ కొద్ది రోజులు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. పోలీసులు నోటీసులు అందించినప్పటికీ బాల్క సుమన్ తన తీరు మార్చుకోలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఇటీవల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుచిత పదాలతో బాల్క సుమన్ ఆరోపించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు అందించారు. అయితే ఈ నోటీసులు స్వీకరించిన తర్వాత బాల్క సుమన్ తన తీరు మార్చుకోలేదు. సరి కదా మరింత ఘాటుగా రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తన మీద అక్రమంగా కేసులు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఓ దొంగ. నిన్ననే ఆయనకు సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసులో నోటీసు కూడా ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అయినప్పుడు ఆయన నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయ వంచన అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్ 2 నెలల పాలన అత్యంత దౌర్భాగ్యంగా ఉంది. భారత రాష్ట్ర సమితి నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. వేధింపులకు గురి చేస్తున్నారు.. రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా నిలిపివేయాలి” అంటూ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్రిమినల్ అని బాల్క సుమన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మరో కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్రిమినల్ అని వ్యాఖ్యానించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి కి చెప్పు చూపించారని, ఇప్పుడు క్రిమినల్ అని సంబోధిస్తున్నారని.. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసినప్పటికీ బాల్క సుమన్ తన తీరు మార్చుకోవడం లేదని వారు అంటున్నారు. ఇలాంటి దురుసు వ్యాఖ్యలు చేయడం వల్లనే చెన్నూరు ప్రజలు ఆయనను ఓడించారని.. అయినప్పటికీ బాల్క సుమన్ తన తీరు మార్చుకోవడం లేదని వారు ఆక్షేపిస్తున్నారు. అయితే పోలీసు వర్గాల సమాచారం ప్రకారం త్వరలో బాల్క సుమన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.