
Badvel: బద్వేల్ బరికి అంతా సిద్ధమైంది. ఈనెల 30న ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పార్టీలు కూడా అదే విధంగా ప్రచారం నిర్వహించాయి. విజయం కోసం తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించాయి. అంతిమంగా ఓటరు తీర్పు కోసం వేచి చూడనున్నాయి. ఇక్కడ జరిగిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. అన్ని పార్టీలు తమ అగ్రనేతలను రంగంలో దింపి ప్రచారం చేసినా ఓటర్ల మదిలో ఏముందో తెలియడం కష్టమే.
సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తమ అభ్యర్థిగా ఆయన భార్య సుధను రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ బరిలో నిలిచారు. 1952లో ఏర్పాటైన నియోజకవర్గంలో కాంగ్రెస్ 6, టీడీపీ 4, వైసీపీ 2, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు దీంతో బద్వేల్ ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి మారిన జయరాములు ఎన్నికల ముందు బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ తరఫున కుతూహలమ్మ రంగంలోకి దిగింది. ప్రజలు వెంకటసుబ్బయ్యను గెలిపించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరథి కమలమ్మ టీడీపీ అభ్యర్థి చిన్నయ్యపై విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికలో ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారో తేలాల్సి ఉంది.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,16,139 కాగా ఇందులో పురుషులు 1,08,799, మహిళలు 1,07,340 మంది ఉన్నారు. బద్వేల్, కలసపాడు, బి.కోడూరు, ఎస్.ఎ.కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, అల్లూరు మండలాలతో ఏడు మండలాలతో నియోజకవర్గం అవతరించింది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.