
గ్రామస్థాయి రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. దాదాపు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు ముఖ్యుడిగా పిలుచుకునే చంద్రబాబు గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోంది. పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఆయన దూకుడు తగ్గినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇంచుమించు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో తలపండిన నేతగా ఉన్న చంద్రబాబు రాను రాను రాజకీయాలను పట్టించుకోవడం లేదా..? అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది.
2019 ఎన్నికల తరువాత చంద్రబాబులో కొంత మార్పు వచ్చిందంటున్నారు. అడపాదడపా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న పార్టీ డెవలప్మెంట్ కోసం తీవ్రంగా కృషి చేయడం లేదనే వాదనలు వినిపస్తున్నారు. ఈ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న బాబు ఆ తరువాత ఆ పార్టీతో కలిసున్నాడా..? అంటే అదీ లేదు.. పోనీ సొంతంగానైనా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం చర్యలు తీసుకుంటున్నాడా..? అంటే పట్టించుకోవడం లేదని అంటున్నారు.
కరోనా పుణ్యమాని బాబు హైదరాబాద్ గడప దాటడం లేదు. ఏవో ముఖ్య కార్యక్రమాలకు ఇలా వచ్చి అలా వెళ్తున్న బాబు ఇప్పటికీ ఇంటినుంచే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైనా.. మళ్లీ గాడిలో పడేసేందుకు దృష్టి సారించడం లేదనే తెలుస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొందరు కేసులు, ఇతర కారణాలతో ఇప్పుడు టీడీపీలోని మిగతా వారు సైతం ఎక్కడా కామెంట్ చేయడం లేదు.
రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు ఎదిగిన చంద్రబాబు ఇటీవల నిర్వహించిన మూడోఫ్రంట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకే వేదికకు తీసుకు రావడానికి బాబు ప్రయత్నించారు. అయితే ఆ తరువాత అదీ సాధ్యం కాలేదు. గత ఎన్నికల్లో కేంద్రంతో విభేదించిన కాంగ్రెస్ తో కలిసి నడిచిన బాబు ఇప్పుడు మూడో ఫ్రంట్ మీటింగ్ కు హాజరు కాకపోవడం చూస్తే బాబు ఇక రాజకీయాలకు స్వస్తి పలకనున్నాడా..? అన్న చర్చ సాగుతోంది.