INS Vikrant 2022: భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దాయాది దేశాల తీవ్రమైన పోకడలతో ఇండియా కూడా వాటిని దీటైన జవాబు చెప్పే చర్యలకు ఉపక్రమించింది. వాటి బలాలను తిప్పి కొట్టేందుకు తన బలం కూడా ఇనుమడింపజేసుకుంటోంది. ఇందులో భాగంగా రక్షణ రంగాన్ని మరింత శత్రు దుర్భేద్యంగా మారుస్తోంది. పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారుతున్న పరిస్థితుల్లో భారత్ తీసుకుంటున్న చర్యలు కూడా భారతీయులకు ఆత్మవిశ్వాసం నింపుతోంది. ఇక మాకు భయం లేదని తెలియజేసేందుకు ఇండియా పలు మార్గాలు అన్వేషిస్తోంది.

పూర్తిస్థాయిలో దేశీయంగా తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను వినియోగంలోకి తీసుకొచ్చి శత్రు దేశాలకు సవాలు విసురుతోంది. తమ జోలికి వస్తే ఇక అంతే తరహాలో మన బలం పెంచే చర్యల్లో భాగంగా ఈ నౌకను తయారు చేసింది. ఇందులో యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఇంకా ఇతర సదుపాయాలు కూడా అందులో ఉండటం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన యుద్ధ నౌక కావడంతో హిందూ మహాసముద్రంలో మన దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నించే దేశాల కుట్రలను మనకు తెలియజేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.
Also Read: KCR- Ibrahimpatnam Incident: ప్రజల గోసలు కేసీఆర్ సార్ ను కదిలించడం లేదా?
డ్రాగన్ ఇప్పటికే శ్రీలంకను తన గుప్పిట్లో పెట్టుకుంది. పాకిస్తాన్ ను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నౌకలో 30 యుద్ధ విమానాలు ఉంచుకోవచ్చు. మిగ్-29కే ఫైటర్ జెట్ లు, కమావ్ -31, హెచ్ ఆర్ -60 ఆర్ హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. నౌకలో మెడికల్ కాంప్లెక్స్, ఫిజియోథెరపీ, ఐసీయూ పరీక్ష శాలలు ఉన్నాయి. 1600 మంది సిబ్బంది, 2200 కంపార్ట్ మెంట్లు నిర్మించారు. మహిళా సిబ్బందికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ఈ నౌకను తయారు చేసేందుకు స్టీల్ ను ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్, డీఆర్డీవోలు సమష్టిగా తయారు చేశాయి. విక్రాంత్ డిజైన్ ను కొచ్చిన్ షిప్ యార్డు పూర్తి చేయడం జరిగింది. విక్రాంత్ రాకతో భారత్ ప్రతిష్ట మరింత పెరిగింది. ఈ నౌక ఉన్న దేశాల్లో అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా తరువాత ఇండియా ఆరో దేశంగా అవతరించింది. దీన్ని దేశీయంగా ఉన్న పరికరాలతోనే తయారు చేయడం గమనార్హం. దీని నిర్మాణానికి రూ. 20 వేల కోట్లు కేటాయించింది. కొచ్చిన్ షిప్ యార్డులో సకల సదుపాయాలు కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని జాతీయం చేశారు. ఇక హిందూ మహాసముద్రంలో తన పని ప్రారంభించింది.
బాహుబలి యుద్ధ నౌకగా పేరుపొందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను భారత్ తన అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా తీసుకొచ్చింది. రక్షణ రంగానికి చేయూతనందించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన శక్తిగా మారనుంది. ప్రత్యర్థుల గుండెల్లో తుపాను రేపే సత్తా గల నౌకను భారత్ తయారు చేయడంతో సరిహద్దు దేశాల్లో భయం కనిపిస్తోంది. దీంతో దేశ ప్రతిష్ట బలోపేతం అవుతోంది. ఈ యుద్ధ నౌక తన పనితీరుతో శత్రుదేశాల కదలికలు గమనించి మనకు జరిగే కుట్రలను కూడా తెలుసుకుని మనకు హెచ్చరికలు జారీ చేయనుంది.

