Ayyanna Patrudu Vs Ganta Srinivasa Rao: కొందరు నేతలకు అధికారమే టార్గెట్. ఎక్కడ ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా తమ చేతిలో పవర్ ఉండాలన్నదే వారి అభిమతం. తమ అవసరాన్ని సృష్టించి అవకాశాలుగా మలుచుకొని తమ రాజకీయ పునాదులు వేసుకుంటారు. అటువంటి నాయకుల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినా.. పార్టీకి దూరంగా ఉన్నారు. వైసీపీ, బీజేపీ, జనసేనలో చేరుతారని భావించినా అదీ జరగలేదు. ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్ ను ప్రసన్నం చేసుకొని టీడీపీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిని టీడీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గంటా వైఖరిని తప్పుపడుతున్నారు. ఆయనపై హాట్ హాట్ కామెంట్స్ చేసి తుక్కు రేగ్గొడుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో వాయిసున్న నేతల్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు. పార్టీకి వీర విధేయత ప్రదర్శించడంలో ముందు వరుసలో ఉండే ఈ నేత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో ముందుంటారు. నేరుగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడతారు. అందుకే ప్రభుత్వ బాధిత వర్గాల్లో అయ్యన్న కుటుంబం కూడా ఒకటి. అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి మరీ అయ్యన్నను అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఆయన కుమారుడు విజయ్ సైతం దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఐ టీడీపీ బాధ్యతలను సైతం చూస్తున్నారు. ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అయ్యన్నపాత్రుడు టీడీపీలో కొనసాగారు. అందరూ తనలాగే ఉండి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని భావిస్తారు. కానీ ఉమ్మడి విశాఖలో మరో నాయకుడు గంటా వైఖరి అంటే అయ్యన్నపాత్రుడికి పడదు. ఇటీవల గంటా టీడీపీలో యాక్టివ్ అయిన నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు చేస్తున్న కామెంట్స్ టీడీపీలో హీట్ పుట్టిస్తున్నాయి.

ఇటీవల నారా లోకేష్ తో సుదీర్ఘ సమయం చర్చించిన గంటా యాక్టివ్ అయ్యారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. కొవిడ్, ఇతరత్రా కారణాలతో పార్టీకి దూరంగా ఉండిపోయాయని విలేఖర్ల సమావేశంలో సంజాయిషి ఇచ్చారు. ఇక నుంచి పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎవడండీ ఈ గంటా? ఆయన ఏమైనా మహా నాయకుడా? ప్రధానా? అని సెటైరికల్ గా మాట్లాడారు. లక్ష మందిలో గంటా ఒకడు. ఆ లక్ష మందిలో నేను ఒకడినని వ్యాఖ్యానించారు. పార్టీలోకి అందరూ రావాలి. కష్టపడి పనిచేయాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేయాలన్నదే తమ అభిమతం. నా వ్యాఖ్యలు ఎవరికీ వ్యతిరేకం కాదంటూనే.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కొని.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో బయటకు వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పార్టీకి అండగా ఉండలేని వారిని చూస్తే బాధేస్తుందన్నారు. అయ్యన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయ్యన్న, గంటా మధ్య వైరం ఈ నాటిది కాదు. ఇద్దరూ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వారి మధ్య పొసిగేది కాదు. అందుకే అప్పట్లో చంద్రబాబు విశాఖ నగరానికి గంటాను పరిమితం చేసి.. రూరల్ జిల్లా బాధ్యతలు అయ్యన్నకు అప్పగించారు. అయితే గత ఎన్నికల అనంతరం గంటా టీడీపీలో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. కానీ అయ్యన్న అలా కాదు. చాలా దూకుడుగా ముందుకు సాగారు. వైసీపీ సర్కారు వరుసగా కేసులు పెట్టినా వెరవలేదు. ఇప్పుడు గంటా తిరిగి యాక్టివ్ అయ్యేసరికి అయ్యన్న మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. అందుకే హైకమాండ్ ను తప్పు పట్టకుండా ఏకంగా గంటా శ్రీనివాసరావుపైనే ఫైర్ అవుతున్నారు.
అయ్యన్న ఆగ్రహానికి మరో కారణముంది. వివిధ కారణాలతో టీడీపీకి దూరమైన వారంతా తిరిగి పార్టీలో చేరాలని చంద్రబాబు కోరుతున్నారు. తటస్థులను సైతం ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అయ్యన్నపాత్రుడు సైతం కొణతాలను పార్టీలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గంటా అడ్డుకోవడంతో నొచ్చుకున్న అయ్యన్న నేరుగా కామెంట్స్ కు దిగారు. అయితే విశాఖ వ్యవహారం టీడీపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరి చంద్రబాబు, లోకేష్ లు ఈ పంచాయితీని ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరీ.