Ayodhya Ram Mandir: శేషుడిపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి.. అతడికి సపర్యలు చేస్తున్న లక్ష్మీదేవి.. లేత గోధుమ వర్ణంలో మెరిసిపోతున్న చలువ రాయి..అటూ ఇటూ వింజామరలు విసురుతున్న సేవకులు.. కాషాయ పంచ కట్టుకుని.. ఎర్రటి అంగీ వేసుకుని.. తలకి పాగా చుట్టుకొని.. జైశ్రీరామ్ అనే నినదిస్తుండగా.. శంక, చక్రాల ముద్రితమైన ఎర్రటి ధవళ వస్త్రం మెల్లిమెల్లిగా తెరుచుకుంటుండగా.. ధూప దీపాల మధ్య.. కృష్ణ వర్ణంలో.. దర్శనమిచ్చాడు బాల రాముడు.. వజ్రాల రూపుడై.. ఆభరణాల అలంకృతుడై భక్తకోటిని కరుణించాడు. మంగళవారం అయోధ్యలోని భవ్య రామాలయంలో కనిపించింది ఈ దృశ్యం.
సోమవారం రామాలయ ప్రారంభోత్సవం.. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత మంగళవారం నుంచి భక్తుల దర్శనార్థం ఆలయం తెరుస్తామని ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. భక్తులకు చెప్పినట్టుగానే మంగళవారం నుంచి స్వామి వారి దర్శనాన్ని ప్రారంభించింది. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాన అర్చకులు తరలిరాగా.. సేవకులు వింజమరాలు ఊపుతుండగా.. వాయిద్య బృందం రామ కీర్తనలు ఆలపిస్తుండగా స్వర్ణమయమైన రాముడి ఆలయ తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. రాజస్థాన్లోని గులాబీ చలవరాయితో నిర్మించిన ఆలయ అంతర్భాగం వజ్రం లాగా మెరిసిపోయింది. బాల రాముడు కొలువై ఉన్న గర్భాలయ పై భాగంలో శేషుడిపై విష్ణుమూర్తి శయనిస్తున్నట్టు చెక్కిన శిల్పం ఆకట్టుకున్నది. ఇదే సమయంలో ప్రధాన అర్చకులు వేదమంత్రాలు ఆలపిస్తుండగా రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. తొలి రోజు వేలాదిమంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండడంతో హిందూ ధార్మిక సంస్థలు అన్నదానాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ నుంచి విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 41 రోజులపాటు అన్నదాన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఆ సంస్థలు గత కొద్దిరోజులుగా అన్నదానాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రాంత ఔన్నత్యం ఉట్టిపడేలాగా వంటకాలు వండి భక్తులకు పెడుతున్నాయి. తొలి రోజు భక్తుల దర్శనార్థం ఏర్పాట్లు చేసిన రామ జన్మభూమి ట్రస్ట్.. రామాలయాన్ని అందమైన పూలతో అలంకరించింది.. కాశ్మీర్లో లభించే తులిప్ పుష్పాల నుంచి మొదలు కేరళలో లభ్యమయ్యే కల్వ పూల దాకా అన్నింటితో శోభాయమానంగా అలంకరించింది. ఇక తెలుగు నాట సుప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం రెండు లక్షల లడ్డూలు పంపించడంతో.. రామ జన్మభూమి ట్రస్ట్ బాధ్యులు రాముడి దర్శనార్థం వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. ఇక తొలి రోజు బాలరాముడి దర్శనానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.