YS Viveka Case: వివేకా హత్య కేసు విచారణలో కీలక ట్విస్టు. విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని కోఠి సీబీఐ కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. సోమవారం పులివెందులలో నోటీసులందించారు. దీంతో సోమవారం సాయంత్రం అవినాష్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.దీంతో విచారణకు హాజరవుతారని అంతా భావించారు. కానీ మంగళవారం ఉదయం ట్విస్టు ఇచ్చారు. విచారణకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఈ అంశం సంచలనంగా మారింది. చర్చనీయాంశమవుతోంది.
ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అరెస్టయ్యారు. సీబీఐ తన కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడుతోంది. అటు అవినాష్ రెడ్డిని సైతం పలుమార్లు విచారించింది. స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. తండ్రి భాస్కరరెడ్డి అరెస్టు తరువాత తనను కూడా అదుపులోకి తీసుకుంటారని అవినాష్ రెడ్డి భావించారు. అందుకే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోర్టు అనుమతించలేదు. హత్యకేసులో అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ స్పష్టంగా తన అఫిడవిట్లో పేర్కొంది. అయినా సరే తాను నిర్దోషినని.. తనకు ఏ పాపం తెలియదని.. ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.
అయితే మంగళవారం విచారణకు హాజరవుతారని భావించారు. కానీ సెడన్ గా అవినాష్ రెడ్డి అడ్డం తిరిగారు. తాను విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మీడియాతో మాట్లాడారు. తనకు ముందుగా నిర్ణయించున్న షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున మంగళవారం సీబీఐ విచారణకు హాజరుకావడం లేదని వెల్లడించారు. సీబీఐ విచారణకు హాజరు కావడానికి తనకు నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. నాలుగు రోజుల తర్వాత సీబీఐ విచారణకు వస్తానని తెలిపానని ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాకు వివరించారు.విచారణ వాయిదా వేయాలని అవినాష్ కోరిన నేపథ్యంలో సీబీఐ ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.